బీజేపీ అధిష్టానం తెలంగాణా గవర్నర్ తమిళశై సంగతి తేల్చేస్తుందా? తేల్చేయడం ఏమిటంటే… ఆమెను గవర్నర్ గానే కొనసాగిస్తారా లేదా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి నిలబెడతారా? అనేది. నిజానికి తమిళిసైకి కూడా ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ఉంది.
ఆల్రెడీ ఆమెకు ప్రత్యక్ష రాజకీయాలలో అనుభవం ఉంది. కాకపోతే చట్టసభలోకి అడుగుపెడితే మరింత ఎక్కువగా ప్రజాసేవ చేయొచ్చని ఆమె ఉద్దేశం కావొచ్చు. తమిళిసైది ఆల్రెడీ రాజకీయ కుటుంబమే. గవర్నర్ గా, స్పీకర్ గా లేదా రాజ్యసభకు, శాసనమండలికి చైర్మన్ గా ఉన్న వారికి ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక ఉంటుంది. ఎంతైనా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న కిక్ వేరే కదా.
తమిళశై కూడా అందుకు అతీతురాలు కాదు. దేవుడు కరుణించి భారతీయ జనతా పార్టీ హైకమాండ్ అవకాశమిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు తమిళిసై. అటు అధిష్ఠానం కూడా కన్యాకుమారి లోక్‌సభ స్థానంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. తమిళనాడులోని లోక్‌సభ స్థానాలలో బీజేపీకి మంచి పట్టు ఉన్న స్థానం కన్యాకుమారి. దీంతో అక్కడ నుంచి తమిళిసైని పోటీ చేయించాలని బీజేపీ కసరత్తు చేస్తోంది.
కన్యాకుమారిలో నాడార్ సామజిక వర్గం అత్యధికంగా ఉన్నారు. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన తమిళిసైకి ఇవ్వాలని బీజేపీ ఆలోచన చేస్తోంది. నాడార్ సామజిక వర్గానికి చెందిన నటుడు విజయ్ వసంత్‌పై తమిళిసైని పోటీ ఉంచేలా బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది. తాను సాధారణ కార్యకర్తనని, తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తానన్నారు.
భవిష్యత్‌లో బీజేపీ హైకమాండ్ ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తా అన్నారు తమిళిసై. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై సౌందర్ రాజన్ కు కేంద్రం గవర్నర్ గా అవకాశం కల్పించింది. 2019 సెప్టెంబర్ లో గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత పుదుచ్చేరి ఇంచార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు తీసుకున్నారు.
తెలంగాణ గవర్నర్‌గా, అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక తనదైన మార్క్ చూపించారు తమిళిసై. ఆమె తీసుకున్న అనేక నిర్ణయాలు సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ తమిళిసై అన్నట్లుగా మారింది. గవర్నర్ గా తమిళిసై పదవీకాలం మరో నాలుగు నెలల్లో పూర్తవుతుంది. మరోసారి గవర్నర్ గా తమిళిసై ని కొనసాగిస్తారా? లేదా? అనే చర్చ జరుగుతోంది.
గతంతో పోలిస్తే డీఎంకే, కాంగ్రెస్ కూటమికి ప్రత్యామ్నాయంగా తమిళనాడులో బీజేపీ కాస్త పుంజుకున్నట్లు తమిళిసై భావిస్తున్నారు. అందుకే ఈసారి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే గతంలో మూడుసార్లు అసెంబ్లీకి, రెండుసార్లు పార్లమెంట్ కూ పోటీ చేసినా తమిళిసై సౌందర రాజన్ బోణీ కొట్టలేకపోయారు. కానీ ఈసారి పరిస్ధితుల్లో మార్పు కనిపిస్తోందని ఆమె అంచనా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అందుకే గవర్నర్ పదవుల్ని వదులుకుని మరీ ఎంపీగా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. దీనిపై బీజేపీ అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయి. తూత్తుకుడి లేదా విరుదునగర్ నుంచి ఆమె పోటీ చేస్తారని సమాచారం. గత ఎన్నికల్లో తూత్తుకూడి నుంచి పోటీచేసిన తమిళిసై.. డీఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో ఓటమి చవిచూశారు.
2006 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి రామనాథపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. తమిళనాడు పీసీసీ మాజీ అధ్యక్షుడు కమరి ఆనంద్ కుమార్తె అయిన తమిళిసై సౌందరరాజన్ బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 1999లో ఆ పార్టీలో చేరారు. తమిళనాట బీజేపీ బలోపేతంలో ఆమె పాత్ర కీలకమైంది.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా, జాతీయ కార్యదర్శిగా పలు పదవులను నిర్వహించారు. 2006 ఎన్నికల్లో రామనాథపురం నియోజవర్గం నుంచి తొలిసారి పోటీ చేయగా ఓటమి ఎదురైంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరచెన్నై నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు. ఈసారి ఏమౌతుందో చూడాలి.