ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆశలకు బీజేపీ గండి కొట్టింది. బీజేపీతో కలిసి పోటీ చేయాలనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది అన్నట్లుగా బాబు, పవన్ ఒకలా అనుకుంటే మోడీ, అమిత్ షా మరోలా అనుకున్నారు.
తొందరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ కనుమరుగు కావడం ఖాయమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో ఒంటరిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టడం అసాధ్యమని భావించి జనసేనతో జట్టుకట్టి కూటమిగా కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.
అప్పటికీ ధైర్యం చాలక ఏపీలో ఒక్క శాతం ఓటింగ్ కూడా లేని బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడారు. ఈ నేపథ్యంలో గత నెలలో అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు ఆ తర్వాత మౌనంగానే ఉండిపోయారు. చంద్రబాబు మౌనం వెనుక ఉన్న అంతరార్ధం ఏంటో ఎవరికీ అంతుచిక్కలేదు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి ఇష్టం లేదని నేను పొత్తు కోసం బతిమాలానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
బీజేపీ రాక కోసమే తొలి జాబితా ప్రకటించి అనగా టీడీపీ 94 స్థానాల్లో పోటీ చేస్తే జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించి 118 స్థానాలను మాత్రమే టీడీపీ- జనసేన కూటమి ప్రకటించాయి. పొత్తులో బీజేపీ కూడా వస్తే మిగిలిన స్థానాలను ప్రకటించేలా టీడీపీ- జనసేన ఉమ్మడిగా ప్లాన్ చేసుకోగా ఇప్పుడు బీజేపీ ఈ కూటమికి షాక్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి.
చంద్రబాబుతో పొత్తులో ఉండడం కంటే ఒంటరిగా పోటీకి దిగడమే మంచిదనే భావనలో బీజేపీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బీజేపీ జాతీయ నాయకుడు శివ ప్రకాష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బీజేపీతో పొత్తు కోసం టీడీపీ జనసేన కూటమి తీవ్ర ప్రయత్నం చేస్తుంటే బీజేపీ మాత్రం అభ్యర్థుల ఎంపికలో, మేనిఫెస్టో రూపకల్పనలో బిజీ బిజీగా గడపడం చూస్తుంటే పొత్తు ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ మాత్రం పొత్తు విషయంలో నాన్చుడు ధోరణిలో ముందుకు సాగుతుంది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ పెద్దలకు సుతరామూ ఇష్టం లేదని సమాచారం.
ఈ నేపథ్యంలో కమలం పార్టీ సైతం.. కదనానికి కాలు దువ్వుతోంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి తమ సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమైంది. రెండు రోజుల పాటు జరిగిన పార్టీ కీలక సమావేశాల్లో నాయకులను సిద్ధం చేయడమే కాకుండా.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. 2,500కు పైగా వచ్చిన అప్లికేషన్స్‌ను వడపోసే క్రమంలో భాగంగా.. రెండు రోజుల పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జాతీయ నాయకుడు శివ ప్రకాష్‌తో పాటు మరికొందరు ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఈ అభ్యర్థుల స్క్రీనింగ్ జరిగింది. ఒక్కో జిల్లాతో 45 నిమిషాల నుంచి గంట పాటు సాగిందీ సమావేశం. స్థానిక పరిస్థితులు, ఆశావహుల ఆర్థిక పరిస్థితులు, పార్టీలో ఎప్పటి నుంచి పని చేస్తున్నారు అనే అంశాలను ప్రామాణికంగా.. ఒక్కో అసెంబ్లీ స్థానానికి ముగ్గురు, పార్లమెంట్ సీటుకు ఇద్దరి చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు 525 మందికి పైగా అభ్యర్థులను ఖరారు చేసింది రాష్ట్ర నాయకత్వం. ఈ లిస్ట్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లనుంది. అక్కడ మరోసారి స్క్రీనింగ్ జరిగిన తర్వాత అభ్యర్థులు ఫైనల్ కానున్నారు. త్వరలోనే కొంతమంది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే విధంగా బీజేపీ కసరత్తు చేస్తోంది.