ఐరనే వంచాలా ఏంటీ? అంటూ వచ్చిన ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్ తెగ వైరల్ అయింది. ఆ డైలాగును రకరకాలుగా వాడారు. మొత్తం మీద వైరల్ కంటెంట్ అయింది. కానీ దాని ఫాలో అప్ గా వచ్చిన టీజర్ మాత్రం అంత సంతృప్తి కలిగించలేదు. రాత్రి పొద్దు పోయేవరకు వేచి చూసిన సినిమా ఫ్యాన్స్ కాస్త డీలా పడిన మాట వాస్తవం.
ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు, పరుశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ కు ఎక్స్ పెక్టేషన్స్ కాస్త హై లోనే వుంటాయి. బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఇద్దరూ సరైన సినిమా కోసం ఎదురుచూస్తున్న నేపథ్యం. ఇలాంటి టైమ్ లో ఫ్యామిలీ స్టార్ లాంటి సాఫ్ట్ టైటిల్ పెట్టారు అనుకుంటే, సాఫ్ట్ టీజర్ వదిలారు.
ర్యాప్ సాంగ్ ద్వారా హీరో క్యారెక్టరైజేషన్ చెప్పడం, చివర్న చిన్న ఫన్ డైలాగ్ చెప్పించడం అంతా ఓకె. కానీ ఈ కంటెంట్ ఆ కాంబినేషన్ కు సరిపోతుందా అన్నది సందేహం. మాంచి ఓపెనింగ్ తెగాలి అంతకు మించిన కంటెంట్ బయటకు రావాలి. ఫ్యామిలీ కంటెంట్ అన్నది రన్ కు పనికి రావచ్చు. గీత గోవిందం విషయంలో అదే జరిగింది. కానీ ఇప్పుడు ట్రెండ్ వేరు. మాంచి ఓపెనింగ్ పడాలి. దాంతో పాటే మాంచి టాక్ వచ్చేయాలి. అలాంటి దాని కోసం ఇప్పుడు ఓ మాంచి ట్రయిలర్ కట్ చేసి అందించాల్సి వుంది.
ఇప్పటి వరకు వదిలిన పాట నెమ్మదిగానే అయినా వైరల్ అయింది. టీజర్ ఇచ్చిన కాస్త అసంతృప్తిని ట్రయిలర్ పోగొట్టాల్సి వుంది. అలాంటి ట్రయిలర్ మీద ఇప్పుడు దృష్టి పెట్టవచ్చు. కానీ అక్కడితో సరిపోదు. అలాంటి ఆసక్తికరమైన కంటెంట్ సినిమాలో వుండాలి. విజయ్ లాంటి యూత్ ఫుల్ హీరో ను, మాంచి మాస్ ఫాన్ ఫ్యాలోయింగ్ వున్న హీరోతో సినిమా తీస్తున్నపుడు బడ్జెట్ పద్మనాభం మాదిరిగా పూర్తిగా ఫ్యామిలీ కంటెంట్ కు కట్టేస్తే కష్టం కావచ్చు. దర్శకుడు పరుశురామ్ మరి ఏం చేస్తారో చూడాలి.