పవన్ తన మనో భావాలు పక్కాగా ప్రకటించిన తరువాత చేగొండి, ముద్రగడ లాంటి వాళ్లు పక్కకు తప్పుకున్నారు. ఎల్లో మీడియా దీనిని ముసుగు తీయడంగా అభివర్ణిస్తోంది. కానీ ఇటు పక్క నుంచి తీస్తే పవన్ ముసుగు తీసిన తరువాత వాళ్లు బయటకు వచ్చారు అనుకోవచ్చు కదా? వాళ్లు పవన్ ను మొదటి నుంచీ కోరుతున్నది ఒక్కటే తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయవద్దు.. భాగస్వామ్యం పెట్టుకోండి అనే కదా.
మన తెలుగు సినిమాలో హీరో కోరి విలన్ దగ్గరకు వెళ్లి, తన పని తనం ప్రదర్శిస్తే, విలన్ ఏమంటాడు.. నా దగ్గర పని చేయ్.. కావాల్సినంత తీసుకో అనే కదా. అప్పుడు హీరో ఏమంటాడు.. నేను ఒకరి కింద పని చేయను.. కలిసి పని చేస్తాను అనే కదా.. ఫిఫ్టీ.. ఫిఫ్టీ భాగస్వామ్యం కావాలనే కదా.
మరి సినిమాల్లో హీరోగా చేసి, అలాంటి సంగతులు తెలిసిన పవన్, తెలుగుదేశం దగ్గరకు వచ్చేసరికి ఇలా ఎందుకు అయిపోతున్నారు అనే బాధ కాపు సీనియర్ నాయకులది. పవన్ తన మాటలతో తనంటే వీర లెవెల్ క్రేజ్ తో వున్న అభిమానులను సంతృప్తిపర్చవచ్చు. కానీ రాజకీయం అంటే ఏమిటో తెలిసిన సీనియర్లను కాదు కదా?
ఈ ఎల్లో మీడియా బాధేంటీ అంటే, పవన్ అలా వీలయినన్ని తక్కువ స్ధానాలు తీసుకుని, తన వెనుక వున్న సామాజిక వర్గ ఓట్లు అన్నీ గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకి అందించేయాలి. అప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వస్తే, దాని పునాదుల్లో దాగిన సామాజిక వర్గం బయటకు వచ్చి, రాష్ట్రాన్ని దున్నేసుకుంటుంది. అందుకు అడ్డం పడే ఈ కాపు సామాజిక వర్గ సీనియర్లు సదరు మీడియాలకు కోవర్ట్ లుగా కనిపించడంలో ఆశ్చర్యం ఏముంది?
పవన్ చేస్తున్న ప్లానింగ్ నే కరెక్ట్, కాపునాడు సీనియర్ నేతల భావనే తప్పు అనుకుందాం. కానీ చిరకాలంగా కమ్మవారితో కొట్లాడుతూ వస్తూ కాపు ఉద్యమాన్ని రన్ చేస్తున్నవారికి తెలుస్తుందా తెలుగుదేశం మనోగతం, పవన్ కు తెలుస్తుందా? పవన్ కు చిన్న పాటి దెబ్బ తగలకుండానే 2019లో తెలుగుదేశం పార్టీకి దూరం జరిగి, లోకేష్ ను, చంద్రబాబును పరుషపదజాలంతో ఎందుకు విమర్శించారు. ఆ రోజు ఎందుకు దూరం అయ్యారు అన్న దానికి ఇప్పుడు వివరణ ఇవ్వగలరా? అంటే ఆరోజు ఏదో తేడా వచ్చింది. ఈ రోజు ఆ తేడా సెట్ అయింది. అది జనసైనికులకు అర్ధం కాకపోవచ్చు. లేదా పవన్ మీద వున్న వీరాభిమానంతో తెలుసుకోలేకపోవచ్చు. కానీ అనుభవం పండించుకున్న సీనియర్లకు తెలుస్తూనే వుంటుంది కదా.
ఇంకా గమ్మత్తైన విషయం ఏమిటంటే కాపు సీనియర్లు కావచ్చు, మరెవరైనా కావచ్చు వైకాపా దగ్గరకు చేరితే కోవర్డ్ లు, కాపు కుల ద్రోహులు, అదే తెలుగుదేశం దగ్గరకు చేరితే మాత్రం రాష్ట్ర ప్రగతి కాముకులు..
రెండూ రెండు పార్టీలు.
ఒక కమ్మ ఆధిపత్యం వున్న పార్టీ.
మరోటి రెడ్ల ఆధిపత్యం వున్న పార్టీ. అదే కదా తేడా.
మరి కృష్ణ, గుంటూరు, ఈస్ట్ ప్రాంతాల్లో కాపు సామాజిక వర్గం దశాబ్దాల కాలంగా కొట్లాడుతున్నది కమ్మవారితోనా? రెడ్లతోనా?
వంగవీటి కుటుంబానికి వివాదం కమ్మవారితోనా? రెడ్లతోనా? వంగవీటి హత్య అనంతరం ఎవరి ఆస్తుల మీద దాడులు జరిగాయి. మరి కాపుల మైత్రి ఎవరితో పవన్ చెబుతున్నట్లు కమ్మవారితోనా? రెడ్లతోనా?
పోనీ ఆ విషయం పక్కన పెడదాం. పవన్ కు ఇష్టమై చంద్రబాబు పక్కకు చేరారు. సీనియర్లకు ఇష్టమై జగన్ పక్కకు చేరారు అనుకొవచ్చు కదా.
మరి ఎల్లో మీడియా వారిని ముసుగు తీసిన వారిగా, కోవర్డ్ లుగా ముద్ర వేసి కాపు వర్గం నుంచి వెలివేసే ప్రయత్నం చేయడం ఎంత వరకు సబబు?
ఇప్పుడే ఏముంది. మిగిలిన 19 సీట్లు కూడా పవన్ ప్రకటించాక మరింత క్లారిటీ వస్తుంది. జనసేనను నమ్ముకున్నవారికి ఇచ్చిన ప్రయారిటీ ఎంత? వలస వచ్చిన వారికి ఇచ్చిన ప్రయారిటీ ఎంత? వారిలో ఎందరిని తెలుగుదేశం పార్టీ అట్నుంచి ఇటు పంపింది? అన్నీ తెలుస్తాయి. అప్పుడు మరింత మంది కాపు నేతలు వైకాపా వైపు నడుస్తారు.
ఎల్లో మీడియా చేత వాళ్లు కూడా ముసుగు తీసిన కోవర్ట్ లు అని ముద్ర వేయించుకుంటారు.