తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబసభ్యులు పోటీచేస్తేనే పార్టీకి కాస్త జోష్ వస్తుందని, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా గెలుపుమీద నమ్మకంతో పనిచేస్తాయని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ దారుణంగా దెబ్బతిని ఉండడం, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సిటింగ్ ఎంపీల ఒక్కరొక్కరుగా పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి జంప్ అవుతూ ఉండడం ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భారాస బాగా బలహీన పడిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని తట్టుకుంటూ కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయాలంటే.. గెలుపుపై నమ్మకంతో ముందుకు సాగాలంటే.. కేసీఆర్ కుటుంబసభ్యులు ఒక్కరైనా ఎంపీ ఎన్నికల్లో పోటీచేస్తే బాగుంటుందని పార్టీ భావిస్తోంది.
వారి కుటుంబంలో కేసీఆర్, కల్వకుంట్ల కవితలకు ఎంపీలుగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. తాజాగా కేటీఆర్ కూడా తాను మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి అవసరమైతే పోటీచేస్తానని ఒక సవాలు విసిరారు. ఇది కేవలం రేవంత్ ను రెచ్చగొట్టడానికి చేసిన సవాలుగా కాకుండా.. పార్టీని కాపాడే నిర్ణయంగా మారాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఆయన నిజంగానే ఎంపీగా పోటీచేయాలని అనుకుంటున్నారు.
పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్న సన్నాహక సమావేశాలలో వారు ఎంత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ.. పార్టీ బలహీనపడుతున్న సంగతి కార్యకర్తలకు అనుభవంలోకి వస్తోంది. కొందరు ఎంపీలు ఆల్రెడీ పార్టీ మారిపోయారు. ఈ బాటలో సిటింగ్ ఎంపీలు ఇంకా ఉన్నట్టుగా, ఇతర పార్టీలతో మంతనాలు సాగిస్తున్నట్టుగా వారికి తెలుస్తోంది.
మునిసిపాలిటీలు, జడ్పీలు ఒక్కటొక్కటిగా గులాబీదళం చేతుల నుంచి కాంగ్రెసు పరం అవుతున్నాయి. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ ఇంకా గేట్లు ఓపెన్ చేసినట్లు లేదు. ఎమ్మెల్యేలు పలువురు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తూన్నారు గానీ.. ఇంకా చేరికలు మొదలు కాలేదు.
ఎంపీ ఎన్నికల విషయంలో ప్రధానంగా భాజపా- కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న తమ పార్టీకి ఇది చాలా ప్రమాదకరపరిణామం అని కార్యకర్తలు భావిస్తున్నారు. ఒకవైపు గులాబీ నాయకులు మాత్రం.. తమకు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ భాజపాతో మాత్రమేనని, కాంగ్రెస్ రేసులో లేదని అంటున్నారు. ఈ మాటలు చాలవని.. పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మరింత క్రియాశీలంగా పనిచేయాలంటే.. కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఎన్నికల్లో పోటీచేస్తే బాగుంటుందని అంటున్నారు.