తెలుగుదేశం పార్టీ గానీ, జనసేన గానీ.. వాలంటీర్ల వ్యవస్థను కొన్నేళ్లుగా ఎంతగా దుమ్మెత్తిపోస్తున్నాయో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. వాలంటీర్ల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడ ద్వారా పవన్ కల్యాణ్ వారిని ఎంతగా అవమానించారో కూడా అందరికీ తెలుసు.
అయితే ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో.. ఆ రెండు పార్టీలు కూడా వాలంటీర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడుతున్నాయి. వారికి ప్రలోభాలు పెడుతున్నాయి. లోబరచుకోవడానికి కుట్రలు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఆ రెండు పార్టీల నాయకులు- రాబోయేది తమ ప్రభుత్వమేనని, తమ ప్రభుత్వం రాగానే మీ అంతు చూస్తాం అని వాలంటీర్లను బెదిరిస్తున్నట్టుగా కూడా వినిపిస్తున్నది.
వాలంటీర్ల వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రూపుదిద్దుకున్న ఒక సరికొత్త నవీన ప్రజోపయోగకరమైన ఏర్పాటు. గత తెలుగుదేశం హయాంలో పెన్షన్ల కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు నిరీక్షించే పరిస్థితి, వారికి దక్కే పెన్షన్లలో స్థానిక నాయకుల చేతివాటం లాంటివెన్నో చోటుచేసుకునేవి. అయితే పెన్షన్లను ప్రతినెలా ఒకటో తేదీనే ఇంటి ముంగిటకే వచ్చి ఇచ్చే ఒక ఆదర్శనీయమైన వ్యవస్థను జగన్ వాలంటీర్ల ద్వారా సాధ్యం చేశారు.
ప్రతి యాభై కుటుంబాలకు ఒకరుగా నియమితులైన వాలంటీర్లు, ప్రభుత్వానికి పేదలకు మధ్య అచ్చమైన వారధులుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నారు. వీరిపై పచ్చదళం మాత్రం అక్కసు పెంచుకుంటూ వచ్చింది. వీరిద్వారా అందుతున్న సేవలు పొందుతున్న వారు.. వైసీపీమీదనే అభిమానం పెంచుకుంటారని, జగన్ కే ఓటు వేస్తారనేది వారి భయం.
అయితే తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పచ్చదళం వ్యూహం మారుస్తోంది. వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేయగల స్థితిలో ఉంటారని నమ్ముతున్న నేపథ్యంలో వారిని లోబరచుకోవడానికి కుట్రలు చేస్తున్నది. వారిని ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు వాలంటీర్లను తెలుగుదేశం, జనసేన తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా వాలంటీర్ల కమ్యూనిటీ తమకు అనుకూలంగా మారుతున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు.
ఇన్నాళ్లూ వాలంటీర్లు వైసీసీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఆడిపోసుకున్న వారే.. వాలంటీర్లను తెలుగుదేశం కార్యకర్తలుగా చేర్చుకోవడం నీతిబాహ్యంగా కనిపిస్తోంది. పార్టీలో చేరికల రూపంలో కొన్ని జరుగుతోంటే.. రాష్ట్రవ్యాప్తంగా కూడా స్థానిక నేతల ద్వారా వాలంటీర్లకు డబ్బులిచ్చి, ప్రలోభపెట్టి వారి ద్వారా తమకు అనుకూల ప్రచారం చేయించుకోవడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరి వారి కుయుక్తులు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో వేచిచూడాలి.