ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి రెబెల్స్ పోటీలో ఉంటారు అని అంటున్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం సీటుని ఆశించి భంగపడిన ఆ పార్టీ సీనియర్ నేత పాశర్ల ప్రసాద్ ఇటీవల ఆత్మీయ సమావేశం పేరుతో ఒక మీటింగ్ పెట్టి తన మనసులో ఉద్దేశ్యాన్ని తెలిపారు.
గత అయిదేళ్ళుగా తాను పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేశానని, పూర్తిగా కష్టపడ్డాను అని చెప్పారు. పార్టీ అధినాయకత్వం ఈసారి కొత్త నిర్ణయం తీసుకుంటుంది అని విశ్వసించాను అని వాపోయారు అయితే యధాప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబుకే టికెట్ ఇచ్చారని దాంతో తాను పార్టీకి రాజీనామా చేశాను అని చెప్పారు. పార్టీకి తాను చేసిన సేవకు గుర్తింపు లేదని అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాను అని ఆయన అంటున్నారు.
రానున్న రోజులలో ఆయన రెబెల్ గా విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. విశాఖ పశ్చిమలో కాపు సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి మూడు సార్లూ ఒకే సామాజిక వర్గం గెలుస్తూ వస్తోంది. అందులో రెండు సార్లు గణబాబు గెలిచారు. గవరలతో పాటు కాపులు కూడా అధికంగా ఉన్న ఈ సీటులో సామాజిక సమీకరణలను చూసి ప్రాధాన్యత ఇవ్వాలని చాలా కాలంగా కోరుతున్నారు.
టీడీపీ మాత్రం కొత్త ప్రయోగాలు చేయలేదు. దాంతో పాశర్ల ప్రసాద్ వర్గం అసంతృప్తికి లోను అవుతోంది. ఆయన ఇండిపెండెంట్ గా పోటీలోకి దిగితే టీడీపీకి రాజకీయంగా నష్టమే అని అంటున్నారు. కాపులు ఇక్కడ నిర్ణయాత్మక శక్తిగా ఉంటారు కాబట్టి సైకిల్ పార్టీకి ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.
ఇదిలా ఉంటే తానే మళ్లీ పోటీ చేస్తున్నాను మరోసారి విశాఖ పశ్చిమ నుంచి గెలవడం ఖాయమని గణబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విశాఖ పశ్చిమలో ఎలాంటి మార్పు చేర్పులు ఉండవని ఎమ్మెల్యే వర్గీయులు అంటున్నారు. టీడీపీ పెద్దలు జోక్యం చేసుకుని విశాఖ పశ్చిమలో సర్దుబాటు చేయకపోతే మాత్రం రెబెల్ బెల్స్ మోగడం ఖాయంగా కనిపిస్తోంది అని అంటున్నారు.