తిరుప‌తిలో కూట‌మి అభ్య‌ర్థిగా వైసీపీ ఎమ్మెల్యే!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో తిరుప‌తిలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. తిరుప‌తి అసెంబ్లీ స్థానం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కం. ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో వుండ‌డంతో విశేష ప్రాధాన్యం సంత‌రించుకుంది. తిరుప‌తి…

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో తిరుప‌తిలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. తిరుప‌తి అసెంబ్లీ స్థానం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కం. ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో వుండ‌డంతో విశేష ప్రాధాన్యం సంత‌రించుకుంది. తిరుప‌తి వైసీపీ అభ్య‌ర్థిగా డిప్యూటీ మేయ‌ర్ భూమ‌న అభిన‌య్ ప్ర‌చారంలో ముందంజ‌లో ఉన్నారు.

కానీ టీడీపీ-జ‌న‌సేన పొత్తులో భాగంగా టికెట్ ఎవ‌రిక‌నే విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు వెల్ల‌డి కాలేదు. టికెట్ త‌మ‌కంటే త‌మ‌క‌ని ఇరుపార్టీల నేత‌లు చెబుతూ వ‌చ్చారు. అయితే టికెట్‌పై స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో ఇరుపార్టీలు ప్ర‌చారంలో దిగ‌డం లేదు. తాజాగా చిత్తూరు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసులు జ‌న‌సేనాని ప‌వన్‌క‌ల్యాణ్‌ను క‌ల‌వ‌డంతో కొత్త చ‌ర్చ‌కు తెర‌లేచింది. తిరుప‌తి నుంచి జ‌న‌సేన బ‌రిలో వుంటుంద‌ని, ఆ పార్టీ త‌ర‌పున చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీ‌నివాసులు పోటీ చేస్తార‌ని విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప‌వ‌న్‌తో భేటీ సంద‌ర్భంలో త‌న‌కు తిరుప‌తి టికెట్ కావాల‌ని అడిగిన‌ట్టు స‌మాచారం. తిరుప‌తిలో త‌న‌కు ఇల్లు వుంద‌ని, స్థానికుడ‌వుతాన‌ని ప‌వ‌న్‌కు చెప్పిన‌ట్టు తెలిసింది. మ‌రీ ముఖ్యంగా బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డంతో ఆయ‌న‌కు క‌లిసొచ్చే అంశంగా చెబుతున్నారు. వీటికి తోడు ఆర్థికంగా స్థితిమంతుడు కావ‌డం ఆయ‌న‌కు టికెట్ అవ‌కాశాల్ని మెరుగుప‌రుస్తుంద‌ని ప‌లువురు అంటున్నారు.

ఇంత‌కాలం తిరుప‌తిలో జ‌న‌సేన‌కు స‌రైన అభ్య‌ర్థి లేక‌పోవ‌డంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ సందిగ్ధంలో ప‌డ్డారు. ఇప్పుడు ఆర‌ణి శ్రీ‌నివాస్ రూపంలో జ‌న‌సేన‌కు మంచి లీడ‌ర్ దొరికార‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. ప‌వ‌న్‌తో శ్రీ‌నివాసులుకు మంచి సంబంధాలున్నాయి. 2009లో చిత్తూరు నుంచి పీఆర్పీ త‌ర‌పున ఆర‌ణి పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న వైసీపీలో చేరి 2014లో పోటీ చేసి మ‌ళ్లీ ఓడారు. 2019లో మాత్రం గెలుపొందారు. 2024లో ఆయ‌న‌కు టికెట్ నిరాక‌రించ‌డంతో ప్ర‌త్యామ్నాయంగా జ‌న‌సేన చూసుకున్నారు.