రాజమండ్రి రూరల్ టికెట్ వివాదం రోజురోజుకూ పెద్దదవుతోంది. ఈ టికెట్ రెండు కులాల మధ్య చిచ్చుకు దారి తీస్తోంది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో కాపు వర్సెస్ కమ్మ అనేలా టీడీపీ, జనసేన మధ్య స్పష్టమైన విభజన కనిపిస్తోంది. అందుకే రాజమండ్రి రూరల్ సీటును రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమపై పెత్తనం ఏంటని కాపులు నిలదీస్తున్నారు.
రాజమండ్రి రూరల్ జనసేన ఇన్చార్జ్ కందుల దుర్గేష్‌కు సొంత సామాజిక వర్గంతో పాటు ఇతర ప్రజల్లో కూడా మంచి పేరు వుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ పవన్‌కల్యాణ్ వెంట నమ్మకంగా నడుస్తున్నారు. గత ఐదేళ్లుగా రాజమండ్రి రూరల్‌లో విస్తృతంగా పర్యటిస్తూ, అక్కడి ప్రజానీకం సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేశారు.
ఈ దఫా మళ్లీ అక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. గత నెలలో రాజమండ్రి పర్యటనలో దుర్గేష్‌కు పవన్‌కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో దుర్గేష్ అనుచరులు సంబరాలు చేసుకున్నారు. కానీ తన స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు ఇవ్వడానికి అంగీకరించనని సిటింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తేల్చి చెప్పారు. తనకు కాకుండా జనసేనకు టికెట్ ఇస్తే, కథ వేరేగా వుంటుందని ఆయన బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో కందుల దుర్గేష్‌ను పవన్‌కల్యాణ్ పిలిపించుకుని పవన్‌కల్యాణ్ మాట్లాడారు. నిదడవోలుకు వెళ్లాలని సూచించారు. దీంతో కందుల దుర్గేష్ షాక్‌కు గురయ్యారు. తన అనుచరులతో మాట్లాడి చెబుతానని పవన్‌కు చెప్పి వచ్చారు. అయితే రాజమండ్రి రూరల్ నుంచి నిడదవోలుకు పంపడాన్ని జనసేన శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రతి రోజూ జనసేన శ్రేణులు కందుల దుర్గేష్‌కు రాజమండ్రి రూరల్ టికెట్ ఇవ్వాలంటూ వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. పొత్తులో భాగంగా తామే అన్నీ సర్దుకుని వెళ్లాలా? కమ్మ నాయకులు చంద్రబాబు మాట వినరా? అంటూ కాపులు నిలదీస్తున్నారు.
ఒకవేళ రాజమండ్రి రూరల్ టికెట్‌ను కాపు నాయకుడైన కందుల దుర్గేష్‌కు కాకుండా బుచ్చయ్య చౌదరికే ఇస్తే మాత్రం ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీని ఓడించి తీరుతామని కాపులు బాహాటంగానే హెచ్చరిస్తున్నారు. కాపులపై కమ్మ నేతల పెత్తనం ఏంటని వారు నిలదీస్తున్నారు. కనీసం కందుల దుర్గేష్ కోసం బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు నచ్చ చెప్పుకోలేరా? అని కాపులు ప్రశ్నిస్తున్నారు.
ఇదే సీఎం జగన్ విషయానికి వస్తే…బీసీలు, ఇతర సామాజిక వర్గాలకు టికెట్లు ఇచ్చేందుకు సొంత సామాజిక వర్గం నేతల్ని సైతం పక్కన పెడుతున్నారని వారు గుర్తు చేస్తుండడం విశేషం. కమ్మ, కాపుల మధ్య పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.