చంద్రబాబునాయుడు రాజకీయ భవిష్యత్‌పై సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. దీనికి కారణం…బాబు ష్యూరిటీ, భవితకు గ్యారెంటీ పేరుతో టీడీపీ కార్యక్రమాలను చేపట్టడమే. మరీ ముఖ్యంగా బాబు పేరుతో ష్యూరిటీ ఇస్తామని ప్రచారం చేసుకోవడం జనాల్లోకి నెగెటివ్ వెళుతోంది. చంద్రబాబుకు ఎవరో ష్యూరిటీ ఇస్తే తప్ప, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై బయటికి వచ్చారంటూ నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు.
కనీసం టీడీపీ ష్యూరిటీ అని చెప్పినా బాగుండేది. విశ్వసనీయతను కోల్పోయిన చంద్రబాబు పేరుతో ష్యూరిటీ ఇస్తామనడం టీడీపీకి ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విసుర్లు చర్చనీయాంశమయ్యాయి. పెద్దిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు భవిష్యత్‌కు గ్యారెంటీ లేదని, ఇక ఆయన ప్రజలకు గ్యారెంటీ ఏమిస్తారని దెప్పి పొడిచారు.
ఎన్నికలొస్తే చాలు… ఇష్టానుసారం చంద్రబాబు హామీలు గుప్పిస్తుంటారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. చంద్రబాబునాయుడు హామీలను, మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. 2014లో వంద పేజీల మేనిఫెస్టోలో సుమారు 600 హామీలు ఇచ్చారని మంత్రి పెద్దిరెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో హామీలేవీ అమలుకు నోచుకోలేదన్నారు.
దీంతో మళ్లీ ఎన్నికల సమయానికి టీడీపీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోను తొలగించారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు హామీలను నెరవేర్చారా? అని ఆయన ప్రశ్నించారు. ఓట్ల కోసం చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా చెబుతారని ఆయన అన్నారు. కానీ వైఎస్ జగన్ పాలనలో హామీలన్న నెరవేర్చారని చెప్పారు.