రాజకీయాల్లో అతి వాగుడు అనర్థం. సాధ్యమైనంత తక్కువ మాట్లాడుతూ, ఎక్కువ పని చేసే వారికే విలువ. రాజకీయాలే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ మాట పొదుపు చాలా అవసరం. ఇతరుల మెప్పుకోసం నోరు పారేసుకుంటే దాని దుష్ఫలితాలు వెంటాడుతూ వుంటాయి. సమయం వచ్చినప్పుడు గతంలో అనవసరంగా మాట్లాడిన మాటలే చావు దెబ్బ తీస్తాయి. అందుకే తెలివైన వారెవరైనా తక్కువ మాట్లాడ్తారు.
తాజాగా ఒకాయన టీడీపీ టికెట్ దక్కించుకున్నప్పటికీ, చివరికి తీవ్ర ప్రజా వ్యతిరేకత కారణంగా తనకు తానుగా పోటీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. సదరు వ్యక్తి గతంలో నోరుంది, భావ ప్రకటనా స్వేచ్ఛ వుంది కదా అని ఇష్టానుసారం బూతులు తిట్టాడు. ఇప్పుడేమైంది? గతం తాలూకూ బూతులు వెంటాడి, వేధించాయి. ఇప్పుడు సాంకేతికత అభివృద్ధి చెందింది. మనం ఏం మాట్లాడినా రికార్డు అవుతోంది. సోషల్ మీడియాలో భద్రంగా నిక్షిప్తం అవుతున్నాయి.
అవసరాన్ని బట్టి తవ్వకాలు చేపట్టి, వాటిని బయటికి తీస్తారు. ఇప్పటి రాజకీయాల్లో ఎవరికీ నిబద్ధత లేదు. ఇందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి, చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్, లోకేశ్… ఇలా ఎవరైనా అతీతులు కాదు. గతంలో సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేధం గురించి వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు ఆయన్ను వెంటాడుతూనే వున్నాయి. ప్రత్యర్థులను వాటిని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇక చంద్రబాబుకు సంబంధించి ఎన్నైనా చెప్పుకోవచ్చు. ప్రత్యేక హోదా విషయంలో ఆయన తీసుకున్నీ యూటర్న్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాగే రైతుల రుణమాఫీ, బ్యాంకుల్లో తనఖా పెట్టిన బంగారాన్ని ఇంటికి తీసుకొస్తానని హామీ ఇచ్చి, ఆ తర్వాత ఎప్పుడు చెప్పానని చంద్రబాబు బుకాయించడంపై వీడియోలు మనకు సాక్షిగా ఉన్నాయి. అలాగే మోదీ, అమిత్‌షాలపై చంద్రబాబు దారుణ కామెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు కూడా చాలా ఎక్కువ మాట్లాడ్డం, ఆ తర్వాత రాజకీయాలకు అనుగుణంగా యూటర్న్ తీసుకోవడంతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు.
పవన్‌కల్యాణ్ తక్కువేం తినలేదు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరితే పాచిపోయిన లడ్డూలిచ్చారని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆ తర్వాత అదే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. చంద్రబాబునాయుడు, నారా లోకేశ్‌లపై ఎన్నెన్నో తిట్లు. ఇప్పుడు పొగడ్తలు. జనసేన కార్యకర్తల్ని నందమూరి బాలకృష్ణ తిట్టారని వాపోయిన నోటితోనే, నేడు ప్రశంసలు. ఇక తన చదువు సంధ్యల గురించి పవన్‌కల్యాణ్ రోజుకో మాట మాట్లాడ్డం ఆయన్ను అభాసుపాలు చేశాయి. అంతెందుకు తణుకు ఎమ్మెల్యే సీటు విషయమై పెద్దపెద్ద ఉపన్యాసాలు ఇచ్చి, చివరికి తుస్సుమనిపించారు. రాజమండ్రి రూరల్ సీటు విషయమై కూడా అంతే. ఎక్కువ మాట్లాడితే ఇంతే.
నోరు అదుపులో పెట్టుకుంటే అన్నింటికి మంచిదని అనేక మంది జీవితాలు మనకు పాఠాలు చెబుతున్నాయి. తాజాగా పి.గన్నవరం టీడీపీ అభ్యర్థి ఉదంతమే నిదర్శనం. గతంలోనూ, వర్తమానంలోనూ అతని తిట్లను వింటే, పౌరసమాజం సిగ్గుతో తలదించునేలా ఉన్నాయి. రాజకీయాల్లో విమర్శలను స్వాగతించొచ్చు. కానీ బూతులు, శాపనార్థాలను విమర్శలుగా పరిగణించే స్థితిలో సమాజం లేదు.
ఏ పార్టీల కోసమైతే, పి.గన్నవరం టీడీపీ అభ్యర్థి గత కొంత కాలంగా సీఎం జగన్ మొదలుకుని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతరత్రా నాయకుల్ని తిడుతున్నారో, ఇప్పుడు తన అనుకునే వాళ్లే సహకరించలేదు. ఎదుటి వాళ్లను తిట్టినంత మాత్రాన, సొంత వాళ్లు సమర్థిస్తారని అనుకోవడం అజ్ఞానం అవుతుంది. అయితే ఏదైనా సమయం చూసుకుని తమ అసంతృప్తి, నిరసనను ప్రకటిస్తారు. సమాజం చైతన్యవంతమైంది. బూతులు తిట్టే వాళ్లను, విద్వేషపూరిత కామెంట్స్ చేసే వాళ్లను ఆదరించే పరిస్థితిలో ప్రజలు లేరు.
ఎన్నికల వరకూ వెళ్లకుండానే అభ్యర్థిని తిరస్కరించేంత చైతన్యవంతమైన సమాజం అని చెప్పుకోడానికి తాజా రాజకీయ పరిణామాలే నిదర్శనం. అందుకే మాట పొదుపు చాలా మంచిది. దాన్ని అలవరచుకుంటే జీవితంలో ఎన్నైనా సాధించొచ్చు.