అనంత అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మొదటి రోజు రిహన్నా తన స్టేజ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొడితే.. రెండో రోజు బాలీవుడ్ ఖాన్ త్రయం ఒకే వేదికపైకి వచ్చి ఆహుతుల్ని అలరించారు.
రాత్రి జరిగిన రెండో రోజు ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ కలిసి స్టేజ్ పై డాన్స్ చేశారు. అది కూడా ఆర్ఆర్ఆర్ లోని నాటు-నాటు పాటకు వీళ్లు స్టెప్పులేశారు.
నాటు-నాటులోని క్లిష్టమైన స్టెప్పును వీళ్లు ప్రదర్శించలేదు. ఆ పాటకు తమదైన సిగ్నేచర్ స్టెప్స్ ను జోడించారు. సల్మాన్ ఖాన్ నాటు-నాటు పాటకు తన టవల్ స్టెప్ వేస్తే.. అమీర్ ఖాన్ తను నటించిన రంగ్ దే బసంతి సినిమాలోని సిగ్నేచర్ స్టెప్ ను రిపీట్ చేశాడు. ఇక షారూక్ ఎప్పట్లానే తన ప్రతి సినిమాలో చేసే ఐకానిక్ డాన్స్ ను మరోసారి నాటు-నాటు కోసం వాడేశాడు.
ఇలా ఖాన్ త్రయం ఒకే స్టేజ్ పైకి వచ్చి డాన్స్ చేయడంతో అనంత అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఆకాశాన్నంటాయి. డాన్స్ తర్వాత ఖాన్ హీరోలంతా ముకేష్ అంబానీని, అనంత్ అంబానీని పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రదర్శన అనంతరం వీళ్లకు అత్యంత ఖరీదైన బహుమతులు అందాయి.
ఈరోజు ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో చివరి రోజు. ఈరోజు సాయంత్రం మరింత మంది ప్రముఖులు తమ ప్రదర్శనతో ఆకట్టుకోబోతున్నారు. ఈరోజు రాత్రితో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముగుస్తాయి.