ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల ప్రభావం ఎక్కువే. అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా కులం ప్రాతిపదికనే జరుగుతోందనేది వాస్తవం. ఎవరైనా తమ కులం వాళ్లు గెలవాలని, అత్యున్నత స్థానాల్లో వుండాలని ఆకాంక్షిస్తుంటారు. కులాలకు అతీతంగా ఆలోచించే వాళ్లు చాలా తక్కువ. అయితే ఏపీలో కులపరంగా తక్కువ ఓటు బ్యాంక్ కలిగిన రెడ్డి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే ముఖ్యమంత్రులుగా అధికారం చెలాయిస్తుండడం గమనార్హం.
ఈ నేపథ్యంలో మూడో ప్రత్యామ్నాయం అంటూ తెరపైకి వచ్చిన జనసేనాని పవన్‌కల్యాణ్ ఏవో అద్భుతాలు చేస్తారని మొదట్లో కొంత మంది అనుకున్నారు. అప్పట్లో ఆయన మాటలు అలా వుండేవి. కానీ ఆయనపై భ్రమలు చాలా త్వరగానే తొలిగిపోయాయి. వైఎస్ జగన్ ద్వేషిగా, చంద్రబాబు భక్తుడిగా పవన్ తనను తాను ఆవిష్కరించుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘కమ్మ’నైన ‘కాపు’దారుడిగా సొంత సామాజిక వర్గం గుర్తించి, అనుమానించి, పక్కన పెట్టే వరకూ వచ్చింది.
ఏపీలో పవన్ రాజకీయ బలం, బలగం కేవలం ఆయన కులం, సినీ అభిమానులే. కేవలం ఉభయగోదావరి జిల్లాల్లోనే రాజకీయంగా పవన్ ప్రభావం చూపుతారని ఎందుకు అనుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ జిల్లాల్లో పవన్ సామాజిక వర్గం బలంగా వుంది. ఇదే రాయలసీమకు వస్తే మెజార్టీ బలిజలు మొదటి నుంచి కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. టీడీపీకి బలిజలు అనుకూలం. జనసేన వచ్చినప్పటికీ, ఎందుకనో సీమలో ఆ పార్టీని కాదని అండగా నిలిచే పరిస్థితి లేదు.
ఏపీలో తమకు 15 నుంచి 16 శాతం ఓట్లు ఉన్నాయని కాపు, బలిజ తదితర అనుబంధ కులాల వాళ్లు చెబుతుంటారు. బీసీల తర్వాత తామే ప్రభావశీల ఓటర్లుగా వారి నమ్మకం. ఓటర్లుగా అధికారాన్ని శాసించే స్థాయిలో ఉండి, రాజ్యాధికారానికి నోచుకోకపోవడం ఏంటనే ఆవేదన చాలా ఏళ్లుగా కాపుల్లో వుంది. కాపుల ఆకాంక్షల్ని ఎవరైనా గౌరవించాల్సిందే. అయితే వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చే నాయకత్వం కొరవడింది. మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రయోగం విఫలమైంది.
ఆ తర్వాత చిరంజీవి సోదరుడు పవన్‌కల్యాణ్ జనసేనానిగా మన ముందుకొచ్చారు. వచ్చీ రావడంతోనే టీడీపీ-బీజేపీ పల్లకీ మోయడం మొదలు పెట్టారు. పార్టీ పెట్టి వెంటనే పోటీ చేయలేకపోయానంటే అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత పార్టీ నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుపై వ్యతిరేక ఓట్లు చీల్చి మళ్లీ ఆయన్ను సీఎం చేయాలని పవన్ తపించారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. దీంతో రెండు చోట్ల పవన్‌ను ఓడించారు.
2024 వచ్చే సరికి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. మొక్కుబడిగా 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ సీట్లతో సరిపెట్టుకున్నారు. ఇలాగైతే పవన్ సీఎం అయ్యేదెట్టా? అని ఆయన్ను అభిమానించే సామాజిక వర్గం నేతలు, అభిమానులు ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. ఇది ఆయనకు ఏ మాత్రం నచ్చడం లేదు. తాను చంద్రబాబునాయుడిని సీఎం చేయాలనే పట్టుదలతో ఉంటే, ప్రశ్నించడానికి మీరెవరంటూ ఆయన బహిరంగంగానే అందరికీ అర్థమయ్యేలా నిలదీసి ఆశ్చర్యపరిచారు. దీంతో తాము మోసపోయామని కాపులకు అర్థమైంది.
కాపులు, బలిజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పవన్‌పై విముఖత క్రమంగా పెరుగుతోంది. పవన్‌ను సీఎం చేయాలని తాము ఆకాంక్షిస్తుంటే, ఆయన మాత్రం ఆ సీట్లో బాబును చూడాలని అనుకుంటున్నారని, అలాంటప్పుడు తామెందుకు అండగా నిలవాలనే అంతర్మథనం కాపుల్లో మొదలైంది. అందుకే మొదటి నుంచి జనసేనకు అండగా నిలిచే నాయకులు ఒక్కొక్కరుగా వీడుతున్నారు.
“కాపు కులానికి మెగా ఫ్యామిలీ ఒకటే దిక్కా? కష్టం వస్తే పవన్ నిలబడతాడా? ఇప్పటిదాకా అసలు కాపుల కోసం ఏమి చేశాడు? మీకు ఇష్టం అయితే భజన చేస్కోండి. కానీ కాపు కమ్యూనిటీ మొత్తాన్ని కలిపి మాట్లాడకండి” అంటూ పవన్‌ను వ్యతిరేకిస్తున్న కాపు యువత సొంత కుల సంఘాలకు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.