అహం త‌ప్ప.. ప‌వ‌న్ ఇంకేం చూపెట్ట‌లేక‌పోతున్నాడా!

ఒక రాజ‌కీయ పార్టీ నేత‌గా ఇన్నేళ్ల‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌య‌ట‌పెడుతున్న‌ది త‌న‌లో ఉండ‌చుట్టుకుని ఉన్న అహంకారాన్ని త‌ప్ప ఇంకోటేమీ లేన‌ట్టుగా మారింది ప‌రిస్థితి! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన రాజ‌కీయంలో అర్థం లేదు,…

ఒక రాజ‌కీయ పార్టీ నేత‌గా ఇన్నేళ్ల‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌య‌ట‌పెడుతున్న‌ది త‌న‌లో ఉండ‌చుట్టుకుని ఉన్న అహంకారాన్ని త‌ప్ప ఇంకోటేమీ లేన‌ట్టుగా మారింది ప‌రిస్థితి! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన రాజ‌కీయంలో అర్థం లేదు, అందుకు ద‌ర్ప‌ణం ఆయ‌న రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవ‌డం!

ఒక‌వేళ ప‌వ‌న్ ను విలువైన రాజ‌కీయ నేత‌గా ప్ర‌జ‌లు గుర్తించి ఉంటే ఆయ‌న‌ను ఎప్పుడో క‌నీసం అసెంబ్లీకి పంపేవారు! అయితే అసెంబ్లీకి వెళ్ల‌డానికి కూడా ప‌నికిరాని వ్య‌క్తిగా ప్ర‌జ‌లు తీర్పునిచ్చారు! ఒకే ఎన్నిక‌లో రెండు చోట్ల పోటీ చేసి, రెండు చోట్లా ఓడిపోయిన వ్య‌క్తిగా చిర‌కీర్తిని ప‌వ‌న్ సొంతం చేసుకున్నారు!

ఐదేళ్లు గ‌డిచాకా కూడా ప‌వ‌న్ రాజ‌కీయంలో పెద్ద మార్పు లేక‌పోవ‌డం విశేషం! గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ వెళ్లి క‌మ్యూనిస్టులు, బీఎస్పీల‌ను క‌లుపుకుని పోటీ చేయ‌డం చంద్ర‌బాబు వ్యూహంలో భాగ‌మే! చంద్ర‌బాబుపై వ్య‌తిరేక ఓటును చీల్చాల‌ని ప‌వ‌న్ అప్పుడు అలా చేశారు, ఇప్పుడు మ‌ళ్లీ చంద్ర‌బాబు వ్యూహం మేర‌కే ఆయ‌న‌తో క‌లిసి పోటీ చేస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల‌ప్పుడేమో తెలుగుదేశం విదిల్చే ముష్టి సీట్ల‌కు జ‌న‌సేన ఆశ‌ప‌డ‌ద‌ని, అందుకే టీడీపీతో క‌లిసి పోటీచేయ‌లేద‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించుకున్నారు. మ‌రి ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అదే ముష్టికి ఆశ‌ప‌డ్డార‌ని అనుకోవాలా! అప్పుడు టీడీపీ ఇచ్చేది ముష్టిసీట్లు అని వ్యాఖ్యానించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ కే తెలియాలి! తెలుగుదేశం వీర ముష్టే ఆయ‌న‌కు బాగా న‌చ్చింది కాబోలు!

ఇక తెలుగుదేశం- జ‌న‌సేన పొత్తుతో ఓట్ల బ‌దిలీ జ‌రుగుతుందా? అనేది కీల‌క‌మైన ప్ర‌శ్న‌! రాజ‌కీయాల్లో ఒక‌టీ ప్ల‌స్ ఒక‌టి ఎప్ప‌టికీ రెండు కాద‌నేది సామెత‌! ఇది వంద‌శాతం వాస్త‌వం కూడా! 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ, జన‌సేన‌ల‌కు వేర్వేరుగా పడ్డ ఓట్లు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క‌న్నా కాస్త ఎక్కువే అనే వాద‌నను అప్పుడే ప‌చ్చ‌మీడియా చెప్పుకొచ్చింది! కాబ‌ట్టి జ‌న‌సేన‌తో ఇప్పుడు టీడీపీ క‌లిసి పోటీ చేసేస్తే.. ఆ ఓట్లూ, ఈ ఓట్లూ క‌లిసిపోతాయ‌నే లెక్కలేసుకున్నారు! అయితే.. జ‌న‌సేన ఒంట‌రిగా పోటీ చేసిన‌ప్పుడు ఆ ఉత్సాహం చూపిన వారు ఇప్పుడు టీడీపీ ఓటేస్తార‌నే లెక్కేముంది? అలా వేయాల‌ని కూడా ఏమీ లేదు!

అలాగే టీడీపీ సోలోగా పోటీ చేసింది కాబ‌ట్టి అప్పుడు ఉత్సాహంగా ఓటేసిన వారిలో ఇప్పుడు త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీనే పోటీ లేకుండా జ‌న‌సేన పోటీకి రాగానే ఓటేస్తార‌నే న‌మ్మ‌క‌మూ లేదు! ఇలా రాజ‌కీయాల్లో రెండు పార్టీల క‌ల‌యిక ఎప్పుడూ విజ‌యాన్ని ఇవ్వ‌దు! ఇలా ఇస్తుంద‌నుకుని.. యూపీలో ఎస్పీ, కాంగ్రెస్ లు క‌లిసి పోటీ చేశాయి గ‌తంలో! కాంగ్రెస్ కు ఏకంగా వంద అసెంబ్లీ సీట్ల‌ను ఇచ్చి అఖిలేష్ యాద‌వ్ మూడు వంద‌ల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో మామూలుగా ఓడిపోలేదు ఆ కూట‌మి! చెప్పుకుంటే పోతే ఇలాంటి క‌థ‌లెన్నో ఉంటాయి.

మ‌రి ఇప్పుడు ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్ర‌చార‌స‌భ‌ల వ‌ర‌కూ వ‌చ్చింది. క‌నీసం ఇక్క‌డైనా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏమైనా  ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే మాట‌లు మాట్లాడుతున్నాడా అంటే.. అదీ లేదు! కేవ‌లం జ‌గ‌న్ పై ద్వేషం త‌ప్ప ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మ‌రే రాజ‌కీయ ఉద్దేశం లేదు అని ఆయ‌నే క్లారిటీ ఇస్తున్నాడు. ప్ర‌జ‌ల‌కు ఏదో మంచి చేయాల‌నో లేదా కాపుల‌కు రాజ్యాధికారం సంపాదించి పెట్టాల‌నో, క‌నీసం త‌న‌ను న‌మ్మి తిరుగుతున్న వారి కోస‌మో ప‌వ‌న్ రాజ‌కీయం చేయ‌డం లేదు. కేవ‌లం జ‌గ‌న్ పై ద్వేషం. జ‌గ‌న్ ను ఓడిస్తే త‌న అహం చ‌ల్లారుతుంది! ఇదీ ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ ప‌రమార్థంగా మారింది.

ప‌వ‌న్ తీరును గ‌మ‌నించి బీజేపీ కూడా ఆయ‌న‌ను ప‌ట్టించుకోన‌ట్టుగా ఉంది. త‌ను ఢిల్లీ వెళ్లి తెలుగుదేశంతో పొత్తుకు బీజేపీని ఒప్పించిన‌ట్టుగా ప‌వ‌న్ చెప్పుకున్న‌ప్ప‌టికీ.. బీజేపీ అలాంటి ఆస‌క్తి చూప‌డం లేద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అదే జ‌రిగితే ప‌వ‌న్ కు మ‌రింత‌గా గాలిపోతుంది. చంద్ర‌బాబు కూడా ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లోనే ప‌వ‌న్ కు పూర్తి సినిమా చూపే అవ‌కాశాలున్నాయి. 24 సీట్ల‌ను జ‌న‌సేన‌కు కేటాయించిన‌ట్టుగా ప్ర‌క‌టించినా.. అందులో ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌వ‌న్ క‌నీసం స‌గం సీట్ల‌కైనా అభ్య‌ర్థులెవ‌రో తేల్చుకున్న‌ట్టుగా లేరు. అది కూడా చంద్ర‌బాబు చేయాల్సిన ప‌నే!

ఏతావాతా.. 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారాలు మొద‌లుపెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. 2024 ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా త‌న అహాన్నే చూపెడుతున్నాడు త‌ప్ప ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌జారంజ‌కమైన తీరునైతే ఎక్క‌డా చాట‌లేదు!

-హిమ‌