ఉత్తరాదిన భారతీయ జనతా పార్టీ తన ప్రభంజనాన్ని ఎంతలా పెంపొందించుకుంటూ ఉన్నా, దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఆ మేరకు ఎదగలేకపోతోంది. దక్షిణాది రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీకి కొరకరాని కొయ్యగానే కొనసాగుతూ ఉన్నాయి. కనీసం కర్ణాటక వరకూ అయినా అధికారం ఉండింది అనుకుంటే, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మళ్లీ లేచింది. బీజేపీని ఓడించి అధికారాన్ని సొంతం చేసుకుంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ కర్ణాటకలో కూడా భారీ స్థాయిలో, కనీసం గత ఎన్నికల్లో వచ్చిన స్థాయిలో అయినా ఎంపీ సీట్లు వస్తాయనే లెక్కలేసుకోవడానికి వీల్లేకుండా పోయింది.
కర్ణాటకలో బీజేపీ ఆఖరికి జేడీఎస్ తో పొత్తుకు కూడా రెడీ అయిపోయింది! జేడీఎస్ ను బీజేపీ మామూలుగా విమర్శించలేదు. ఎంఐఎంకు జేడీఎస్ దోస్తీ కూడా. గతంలో ఎంఐఎం- జేడీఎస్ లు పరస్పరం మద్దతుతో పోటీ చేసిన చరిత్ర ఉంది! అలా ముస్లిం మతవాద పార్టీకి దోస్తీగా వ్యవహరించిన జేడీఎస్ తో ఇప్పుడు బీజేపీ పొత్తు పెట్టుకుంటోంది! ఇక జేడీఎస్ ఫస్ట్ ఫ్యామిలీ అవినీతి గురించి బీజేపీ చేసిన ఆరోపణలు కూడా ఎన్నో ఉన్నాయి. కుటుంబ పార్టీ అంటూ జేడీఎస్ ను మోడీ, అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. అయితే ఇప్పుడు ఆ కుటుంబ పార్టీతోనే కమలం పార్టీ మరోసారి పొత్తుతో బరిలోకి దిగుతూ ఉండటం విచిత్రం!
కర్ణాటక వరకూ జేడీఎస్ తో పొత్తు బీజేపీకి ఎంతో కొంత మేలు చేయవచ్చు. త్రిముఖ పోరు కాకుండా, అలా ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు ద్వారా కొన్ని అదనపు సీట్లను బీజేపీ నెగ్గవచ్చు కూడా! అయితే ఈ ఎన్నికల్లో జేడీఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకోకపోతే ఆ పార్టీ చాలా ఇబ్బందులను పడొచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ చిత్తుగా ఓడింది. జేడీఎస్ స్థానాన్ని కాంగ్రెస్ పూర్తిగా సొంతం చేసుకుంటోంది. లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్ కన్నా కాంగ్రెస్ కే ఓటర్లలో కూడా ఎలాగైనా ప్రాధాన్యత లభిస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న జేడీఎస్ కు బీజేపీతో పొత్తు ఉపయోగకరం కావొచ్చు. పాతమైసూరు రాష్ట్రం పరిధిలో వక్కలిగల ఓట్లను పొందడానికి జేడీఎస్ తో బీజేపీ పొత్తుకు వెళ్తోందనేది కూడా బహిరంగ రహస్యమే! ఇలా బీజేపీకి కర్ణాటక మీద ఆశలున్నాయి. అయితే కనీసం పది ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుందనే టాక్ వినిపిస్తోంది!
ఇక కేరళలో ఈ సారి పూర్తిగా కాంగ్రెస్ దాని మిత్రపక్షాల హవా ఉండవచ్చనేది అంచనా! కమ్యూనిస్టు పార్టీల కూటమిని కూడా చిత్తు చేసి కాంగ్రెస్ పార్టీ కేరళలో 20 ఎంపీ సీట్లనూ పొందినా పెద్ద ఆశ్చర్యం లేదని అంటున్నారు. కేరళ విషయంలో కమలం పార్టీకి కూడా ఆశలేమీ ఉన్నట్టుగా కూడా లేవు. ఇక తమిళనాట కూడా దాదాపు అలాంటి పరిస్థితే కొనసాగవచ్చు. అన్నాడీఎంకే బలం మీద ఆధారపడి పుంజుకోవచ్చన్న లెక్కలేసిన బీజేపీకి అదంతా జరిగే పని కాదని గత లోక్ సభ ఎన్నికల సమయంలోనే అర్థం అయ్యింది. ఇప్పుడు అన్నాడీఎంకే పూర్తిగా మెత్తబడిపోయింది. బీజేపీతో దోస్తీ లేదని ఆ పార్టీ ప్రకటించుకుంది. కమలం పార్టీ అక్కడ ఒంటరి పోరాటం చేస్తోంది, అందుకే మోడీ కూడా తమిళనాడు వ్యవహారాలపై గట్టిగా స్పందించేస్తున్నారు. అయినప్పటికీ లోక్ సభ ఎన్నికలనాటికి పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల నాటికి విజయ్ అక్కడ తన పార్టీతో రంగంలోకి దిగేలా ఉన్నాడు!
కర్ణాటకలో జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్నట్టుగానే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకోవచ్చనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. అయితే అదేమీ జరిగేలా లేదు. రెండు పార్టీలకూ ప్రస్తుతానికి పొత్తు పట్ల అంత ఉత్సాహం ఉన్నట్టుగా లేదు. అయితే గత లోక్ సభ ఎన్నికల స్థాయిలో ఈ సారి తెలంగాణలో బీజేపీ హవా కొనసాగినా గొప్ప సంగతే!
ఏపీలో తెలుగుదేశం పార్టీ బీజేపీని పొత్తుకు పరిపరివిధాలుగా ఆహ్వానిస్తోంది. తెలుగుదేశం, జనసేనలతో పొత్తుకు బీజేపీని తను ఒప్పించినట్టుగా పవన్ కల్యాణ్ చెప్పుకు తిరుగుతున్నాడు. మరి సీట్ల డీలేమిటో ఇప్పటి వరకూ స్పష్టత లేదు! ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల చంద్రబాబుకు ఎందుకు ప్రయోజనం కలిగించాలనే లెక్కలు కమలం పార్టీకి ఉన్నట్టున్నాయి. అందుకే ఇంకా పూర్తిగా తేల్చుకోలేకపోతున్నట్టుంది!
ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. సౌత్ లోని ఐదు రాష్ట్రాల్లో కూడా బీజేపీ కోసం అద్భుతాలు ఏవీ జరిగేలా లేవు! కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్య మరి కాస్త తగ్గడమే తప్ప సాధించగలిగేదేమీ కనపడటం లేదు. మరి ఎందుకు మోడీ మానియాతో ఎందుకు సౌత్ లో కమలం పార్టీ పరిస్థితి ఎందుకు మెరుగవ్వడం లేదో కమలం పార్టీకే తెలియాలి!