విశాఖపట్నం నా పుట్టినిల్లు అని వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి ప్రకటించారు. తాను అక్షరాలా విశాఖ ఆడపడుచుని అని ఆమె స్పష్టం చేశారు. విశాఖలోనే చదువుకున్నాను అని ఆమె చెప్పారు. తన మెట్టినిల్లు విజయనగరం అని ఆమె అంటూ మొత్తం రాజకీయాన్ని అనుకూలం చేసుకునే ప్రయత్నం చేశారు. ఉత్తరాంధ్రా సమస్యల మీద గతంలో ఎంపీగా పనిచేసి సందర్భంగా పార్లమెంట్ లో ప్రస్తావించాను అని గుర్తు చేశారు.
తాను విశాఖ అభివృద్ధికి ఎంపీగా ఉన్నపుడు ఎంతగానో కృషి చేశాను అని చెప్పారు. తనకు గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉందని ఆమె చెప్పారు ప్రజలు వైసీపీకే ఈసారి కూడా ఓటు వేసి తనను విశాఖ ఎంపీగా గెలిపిస్తారు అని ఆమె నమ్మకంగాచెప్పారు.
విశాఖలో బొత్స ఝాన్సీలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి విశాఖలో వెలసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. బొత్స ఝాన్సీలక్ష్మి తాను పక్కా లోకల్ అని చెబుతున్నారు. ఆమె లోకల్ కార్డ్ తీశారు. బీసీ మహిళగా ఉన్నారు. గతంలో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉందని చెబుతున్నారు.
ఇవన్నీ వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా ఆమెకు ప్లస్ పాయింట్లుగా ఉండనున్నాయి. విపక్షాల అభ్యర్ధులు ఎంతటి వారు అయినా అంతా నాన్ లోకల్స్ గానే ముద్ర ఉంది.నాలుగు దశాబ్దాలుగా నాన్ లోకల్స్ ని విశాఖకు దిగుమతి చేస్తున్నారు అన్న ఆవేదన విశాఖ ప్రజలలో ఉంది.
అంతే కాదు విశాఖ ఎంపీగా బీసీను ఎపుడూ ఎన్నుకోలేదు. ఒక మహిళ, విద్యాధికురాలు, బీసీ, లోకల్ ఇలా బొత్స ఝాన్సీకు అన్నీ సమకూరి ఉన్నాయి. ఆమెతో పోటీ పడేవారు ఈ విషయాల మీద తమ గురించి కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. బీసీ లోకల్ కార్డు అన్నది ఈసారి విశాఖ ఎంపీ ఎన్నికల్లో బాగా పనిచేస్తుంది అని అంటున్నారు. విపక్ష కూటముల నుంచి పోటీ చేసేవారికి ఇవే ప్రశ్నలుగా ఎదురవుతాయని అంటున్నారు.