విశాఖ పశ్చిమలో వైసీపీ జెండా ఈసారి అయినా ఎగురుతుందా. ఈ ప్రశ్న స్థానిక నియోజకవర్గంలో అందరిలో ఉంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం 2009లో ఏర్పాటు అయింది. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆ తరువాత 2014, 2019లలో వరసగా టీడీపీ గెలిచింది. టీడీపీ నుంచి రెండు పర్యాయాలు గణబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఆయనకు ఈసారి టికెట్ ఇవ్వవద్దని కొత్త వారికి అవకాశం ఇవ్వాలని టీడీపీలో కీలక నేతలు అధినాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. అయినా తొలి జాబితాలోనే గణబాబు పేరు ప్రకటించారు. దానికి నిరసనగా సీనియర్ నేత పాశర్ల ప్రసాద్ పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతగా ఉన్నారు.
టీడీపీలో ఇలా ఉన్న అసంతృప్తులు వైసీపీకి ఈసారి మేలు చేస్తాయా అన్నది ఫ్యాన్ పార్టీలో కొత్త ఆలోచనలు రేకెత్తించేలా చేస్తోంది. విశాఖ పశ్చిమలో గవర సామాజికవర్గంతో పాటు కాపులు అత్యధికంగా ఉన్నారు. గవర సామాజికవర్గానికి చెందిన గణబాబుకు పోటీగా అదే సామాజిక వర్గానికి చెందిన విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ ని వైసీపీ ఇక్కడ నుంచి పోటీ చేయిస్తోంది.
ఆయన అభ్యర్ధిత్వం రెండేళ్ల క్రితమే ఖరారు చేసి పోటీలోకి దించారు. విశాఖ పశ్చిమలో ప్రణాళికాబద్ధంగా ఆనంద్ ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు.ఆయన అంగబలం అర్ధం బలం కలిగిన వారు, విశాఖ డెయిరీ హిస్టరీ గొప్పది. చైర్మన్ గా ఆయనకు పలుకుబడి ఉంది. వైసీపీలో అంతా ఐక్యంగా పనిచేస్తున్నారు.
వైసీపీ సంక్షేమంతో పాటు క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా కలసివస్తాయని అధికార పార్టీ భావిస్తోంది. ప్రత్యర్ధి పార్టీలోని బలహీనతలు తమకు ప్లస్ అవుతాయని ఊహిస్తోంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో రెండు ఎన్నికల్లో ఓడిన వైసీపీ ఈసారి ఎలాగైనా పశ్చిమాన సూర్యుడిని ఉదయించేలా చేయాలని కంకణం కట్టుకుని పనిచేస్తోంది. వైసీపీ జెండా పశ్చిమాన ఎగిరితే విశాఖలో ఆ పార్టీ బలం రెట్టింపు అయినట్లే అంటున్నారు.