పవన్ కల్యాణ్ తో ఆడుకోవడం రామ్ గోపాల్ వర్మకు కొత్తేం కాదు. కేవలం విమర్శలు చేయడమే కాదు, పవన్ పై సినిమాలు కూడా తీశాడు ఈ దర్శకుడు. గతంలో ఆర్జీవీ తీసిన 2 సినిమాల్లో పవన్ కల్యాణ్ కనిపించాడు. వీటిలో ఒక సినిమా పూర్తిగా పవన్ కేంద్రంగా నడిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తన సినిమాలో పవన్ క్యారెక్టర్ ను పెట్టాడు వర్మ.
కొద్దిసేపటి కిందట తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫొటో షేర్ చేశాడు ఆర్జీవీ. వ్యూహం సినిమాలో ఈ క్యారెక్టర్ గురించి మీరేం అనుకుంటున్నారంటూ పోస్టు పెట్టాడు. ఆ ఫొటో చూస్తే ఎవరికైనా, ఆ పాత్ర ఏంటనే విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది.
వర్మ తాజా పోస్టుతో వ్యూహం సినిమాలో పవన్ కల్యాణ్ పాత్ర కూడా ఉందనే విషయంపై స్పష్టత వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వీడియో రిలీజ్ చేశాడు వర్మ. తండ్రి ఆకస్మికంగా కన్నుమూసిన తర్వాత జగన్ ఏం చేశాడు, అతడి రాజకీయ ప్రయాణం ఎలా సాగిందనే అంశాల్ని ఈ సినిమాలో వర్మ చూపించబోతున్నాడు.
ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి, అదే విధంగా జనసేన నుంచి ఎదురైన విమర్శలు, వాటిని జగన్ ఎలా తట్టుకొని నిలబడ్డారు, ఎలా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారనే విషయాల్ని వ్యూహంలో వర్మ చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన పవన్ కల్యాణ్ పాత్రను కూడా తన సినిమాలో చొప్పించారు.
ఎర్ర కండువా మెడలో వేసుకొని, నేలపై పడుకొని గాల్లో లెక్కలు వేస్తున్నట్టు పవన్ కల్యాణ్ ను చూపించాడు వర్మ. ఈ స్టిల్ చూసిన వెంటనే పవన్ ఫ్యాన్స్, వర్మపై భగ్గుమంటున్నారు. ఇలాంటి ట్రోల్స్ ను వర్మ లైట్ తీసుకుంటాడనే విషయం తెలిసిందే.