వైసీపీకి విశాఖ జిల్లా ప్రెసిడెంట్ గా ఏడాది పాటు పనిచేసిన పంచకర్ల రమేష్ బాబు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజకీయ భవిష్యత్తుని తొందరలో ప్రకటిస్తాను అని చెప్పారు. తన అనుచరులతో చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటాను అని పేర్కొన్నారు.
పంచకర్ల రమేష్ బాబు ప్రజారాజ్యం పార్టీ నుంచి తొలిసారి 2009లో ఎమ్మెల్యే అయ్యారు. విశాఖ జిల్లా పెందుర్తి నుంచి ఆయన గెలిచారు. ఆయన విశాఖకు రెండు దశాబ్దాల క్రితం వలస వచ్చారు. క్రిష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన రమేష్ బాబుకు విశాఖ జిల్లా ప్రజలు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు.
ఈసారి కూడా ఆయన ఎమ్మెల్యే కావాలని అనుకుంటున్నారు. ఆయనకు పెందుర్తి సీటు కావాలి. అందుకే ఆయన టీడీపీలో వీలు కాకపోతే జనసేన అని ఆప్షన్ పెట్టుకున్నారని అంటున్నారు. నెల రోజుల క్రితం పంచకర్ల రమేష్ బాబు పవన్ కళ్యాణ్ ని కలసి వచ్చారు అని ప్రచారం జరిగింది. అప్పటి నుంచే ఆయన పార్టీకి గుడ్ బై కొడతారు అని పార్టీ పెద్దలకు కూడా తెలుసు అని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ పెందుర్తి సీటుకు రమేష్ బాబుకు హామీ ఇచ్చారా అన్నది టీడీపీలో కూడా తమ్ముళ్ళు తర్కించుకుంటున్నారు. అలా కనుక జరిగితే రమేష్ బాబుకు పొత్తులో ఈ సీటు కోసం పవన్ పట్టుబట్టే చాన్స్ ఉంటుంది. ఆ విధంగా జరిగితే మాజీ మంత్రి, అనేకసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి సీటుకే ఎసరు పెట్టినట్లే అంటున్నారు.
బండారు ఇవే తనకు చివరి ఎన్నికలు అని పోటీకి సిద్ధం అవుతున్నారు. గెలిస్తే పార్టీ గెలిస్తే అదృష్టం కలసి వస్తే మంత్రిగా ఒకసారి వెలిగిపోవాలని అనుకుంటున్నారు. టీడీపీ జనసేన పొత్తు వల్ల తన సీటుకే ఎసరు వస్తుందంటే పెద్దాయన బండారు ఎలా ఆలోచిస్తారో అని అంటున్నారు. జనసేన టీడీపీ పొత్తు ఖాయం కాబట్టి కచ్చితంగా పెందుర్తి సీటు జనసేనకే పోతుందని అంటున్నారు.
ఆ ధీమా ఉండబట్టే అధికార పార్టీకి రాజీనామా చేసి మరీ పంచకర్ల బయటకు వచ్చారని అంటున్నారు. పంచకర్ల రాజీనామా వైసీపీకి షాక్ అని అంతా అనుకుంటున్నా అది కాస్తా టీడీపీ పెద్దాయనకే షాక్ గా మారుతోందని ఆయన వర్గంలో కలవరం రేగుతోందిట.