టాలీవుడ్ లో బహుముఖంగా ప్రజ్ఞ కలిగిన దర్శకుల్లో సుకుమార్ ఒకరు. పైగా ఆయనకు వున్న అదనపు క్వాలిఫికేషన్ ఏమిటంటే ఇండస్ట్రీలోనే వుంటారు. అందరితో వుంటారు. కొందరిలా.. నన్ను ముట్టుకోకు అన్నట్లు ముడుచుకుపోయి ఇంట్లో కూర్చోరు. ఇగో తో రగిలిపోరు. ఆ విషయం పక్కన పెడితే పుష్ప 2 మేకింగ్ హడావుడిలో వున్న సుకుమార్ ఇప్పుడు అమెరికా వెళ్లారు. ఏదో షికారుకో, సరదాకో కాదు. తన కుమార్తె కోసం.
సుకుమార్ కుమార్తెకు సంగీతం ఇష్టం. అది ఎలాగూ నేర్చుకుంటున్నారు. అందులో భాగంగా, అమెరికాలోని ఓ ప్రతిష్టాత్మక సంగీత సంస్థలో కొద్ది రోజుల క్రాష్ కోర్స్ చేయడానికి అని అమెరికా వెళ్లారు. ఆమెతో కలిసి సుకుమార్ కూడా వెళ్లారు. సంగీతానికి సంబంధించి చాలా ప్రతిష్టాత్మక సంస్థ అది. కేవలం ఓ చిన్న క్రాష్ కోర్స్ కే అయిదారు కోట్లు ఖర్చు అవుతాయని తెలుస్తోంది.
సుకుమార్ అయినా మరే తండ్రి అయినా సంపాదించేది ఎవరి కోసం పిల్లల కోసం, వారి అభిరుచుల కోసమే కదా. అందుకే సుకుమార్ ఇప్పుడు ఈ భారీ ఖర్చుకు వెనుకాడకుండా అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ కారణంగా పుష్ప 2 సినిమాకు ఓ వారం.. పది రోజులు బ్రేక్ వచ్చింది.