నెల్లూరు లోక్‌స‌భ నుంచి విజ‌య‌సాయిరెడ్డి

నెల్లూరు లోక్‌స‌భ స్థానం నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి పోటీ చేయ‌నున్నారు. ఇవాళ వైసీపీ కేంద్ర కార్యాల‌యం 9వ జాబితా విడుద‌ల చేసింది. ఇందులో అనూహ్యంగా విజ‌య‌సాయిరెడ్డి పేరు వుండ‌డం విశేషం. అలాగే…

నెల్లూరు లోక్‌స‌భ స్థానం నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి పోటీ చేయ‌నున్నారు. ఇవాళ వైసీపీ కేంద్ర కార్యాల‌యం 9వ జాబితా విడుద‌ల చేసింది. ఇందులో అనూహ్యంగా విజ‌య‌సాయిరెడ్డి పేరు వుండ‌డం విశేషం. అలాగే మంగ‌ళ‌గిరి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా మురుగుడు లావ‌ణ్య, క‌ర్నూలు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ పేర్లున్నాయి.

నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిని బ‌రిలో నిల‌పాల‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్ మొద‌ట నిర్ణ‌యించారు. అయితే ఆయ‌న పార్టీ వీడ‌డంతో ప్ర‌త్యామ్నాయంగా ప‌లువురి పేర్ల‌ను జ‌గ‌న్ ప‌రిశీలించారు. ఇందులో భాగంగా విజ‌య‌సాయిరెడ్డి అల్లుడి అన్న శ‌ర‌త్‌చంద్రారెడ్డిని పోటీ చేయించాల‌ని ఆలోచించారు. ఏమైందో తెలియ‌దు కానీ, చివ‌రికి విజ‌య‌సాయిరెడ్డినే పోటీ చేయించాల‌ని నిర్ణ‌యించారు. విజ‌య‌సాయిరెడ్డి నెల్లూరు నివాసే.

ఇక మంగ‌ళ‌గిరి విష‌యానికి వ‌స్తే నారా లోకేశ్‌పై బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిలిపేందుకు జ‌గ‌న్ తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తున్నారు. మంగ‌ళ‌గిరి సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి పార్టీని వీడిన సంద‌ర్భంలో అప్ప‌టిక‌ప్పుడు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా గంజి చిరంజీవిని ప్ర‌క‌టించారు. అయితే స‌ర్వేల్లో చిరంజీవి అభ్య‌ర్థిత్వంపై సానుకూలత క‌నిపించ‌లేద‌ని తెలిసింది. దీంతో మాజీ ఎమ్మెల్యే, చేనేత సామాజిక వ‌ర్గానికి చెందిన కాండ్రు క‌మ‌ల కోడ‌లు మురుగుడు లావ‌ణ్య‌ను పోటీ చేయించేందుకు జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇవాళ సాయంత్రం ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, గంజి చిరంజీవి, కాండ్రు క‌మ‌ల‌, ఎమ్మెల్సీ మురుగుడు హ‌నుమంత‌రావుల‌తో జ‌గ‌న్ చ‌ర్చించిన అనంత‌రం లావ‌ణ్య అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌క‌టించారు.

రెండు రోజుల క్రితం స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఇంతియాజ్‌ను క‌ర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి జ‌గ‌న్ పోటీ చేయిస్తున్నారు. క‌ర్నూలులో ముస్లిం మైనార్టీలు అధికం. సిటింగ్ ఎమ్మెల్యే హ‌పీజ్‌ఖాన్‌తో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్‌రెడ్డికి తీవ్ర విభేదాల నేప‌థ్యంలో అభ్య‌ర్థి మార్పున‌కు జ‌గ‌న్ ఆస‌క్తి చూపారు. ఇంతియాజ్‌ను గెలిపించేందుకు అంద‌రూ ప‌ని చేస్తామ‌ని క‌ర్నూలు నేత‌లు చెప్ప‌డం విశేషం.