రుషికొండ… అలా విపక్షాలకు చెక్!

విశాఖ రుషికొండ వద్ద అత్యాధునికంగా నిర్మించిన పర్యాటక భవనాలను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. అతి ముఖ్య ఘట్టం చాలా సింపుల్ గా జరిగిపోయింది. టూరిజం మినిస్టర్ ఆర్కే రోజా…

విశాఖ రుషికొండ వద్ద అత్యాధునికంగా నిర్మించిన పర్యాటక భవనాలను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. అతి ముఖ్య ఘట్టం చాలా సింపుల్ గా జరిగిపోయింది. టూరిజం మినిస్టర్ ఆర్కే రోజా అయిదు వందల కోట్ల రూపాయలతో  నిర్మించిన ఈ భవనాలను ప్రారంభించారు. ఇక మీదట టూరిస్టులకు అద్దెకి ఇస్తారు.

అంతర్జాతీయంగా విశాఖ టూరిజం స్పాట్ గా పేరు గడించింది. ప్రతీ రోజూ పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తూంటారు. విశాఖ నానాటికీ అభివృద్ధి చెందుతోందని అందుకే పర్యాటక శాఖ భవనాలు పునర్ నిర్మించామని రోజా చెప్పారు.

పర్యాటక శాఖ నుంచి ప్రతిపాదన వెళ్లగానే ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా రియాక్ట్ అయి వెంటనే నిధులు మంజూరు చేశారు అని ఆమె వెల్లడించారు. గతంలో ఎపుడో నిర్మించిన హరిత టూరిజం కాటేజెస్ పూర్తిగా శిధిలావస్థలోకి వచ్చాయని అందుకే సరికొత్తగా నిర్మించామని మంత్రి చెప్పారు.

ఈ విషయంలో అన్ని రకాలైన అనుమతులు తీసుకున్నామని పూర్తిగా పర్యావరణానికి తగినట్లుగా నిర్మించామని ఆమె వివరించారు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని ఆమె హింట్ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిమెన్ కమిటీ దీని మీద నివేదిక ఇచ్చిందని ప్రభుత్వం దీని మీద ఎపుడు నిర్ణయం తీసుకుంటే అప్పటి నుంచే సీఎం విశాఖలో క్యాంప్ ఆఫీసుని ప్రారంభిస్తారు అని రోజా ఆసక్తికరమైన వార్త వెల్లడించారు.

విశాఖలో సీఎం ఆఫీసు ద్వారా పరిపాలన విశాఖ నుంచి ప్రారంభించడానికి తాము ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని అన్నారు. విశాఖ రుషికొండ నుంచి గత నాలుగేళ్లుగా రాజకీయం నడచింది. అనుమతులు లేవని అక్కడ జగన్ సొంత భవనాలు నిర్మిస్తున్నారు అని అనేక విమర్శలు చేశారు.

టీడీపీ అయితే తాము అధికారంలోకి వస్తే ప్రజలకు అప్పగిస్తామని ప్రజా భవనాలుగా చేస్తామని కూడా చెబుతూ వచ్చింది. వారికి ఆ అవకాశం ఇవ్వకుండా ముందే ప్రారంభించి వైసీపీ ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. ఇవి ప్రభుత్వ భవనాలే సుమా జగన్ సొంత భవనాలు కాదు టూరిస్టులు ఎవరైనా రుషికొండ భవనాలు వాడుకోవచ్చు అని ప్రభుత్వం చెప్పి తమ పారదర్శకతను చాటుకుంది. ఎన్నికల వేళ రుషికొండ ఇష్యూ ఇంత సాఫీగా సైలెంట్ గా క్లోజ్ చేసి విపక్షానికి వైసీపీ ఝలక్ ఇచ్చేసింది. 2024లో మరోసారి జగన్ అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలన అన్నది వైసీపీ మాట.