టాలీవుడ్ లో కొత్త కథల రాక కొన్నేళ్లుగా మొదలైంది. కరోనా తర్వాత ఇది ఇంకాస్త పెరిగింది. ఇలాంటి కథలతో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు విశ్వక్. గామి సినిమా అలాంటిదే.
మానవ స్పర్శను తట్టుకోలేని అరుదైన వ్యాధితో ఇబ్బందిపడుతుంటాడు విశ్వక్. హిమాలయాల్లో 36 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ప్రకాశించే ఓ ఆకు దానికి మందు. ఈసారి మిస్సయితే, మరో 36 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే.
దానికోసం హీరో సాగించిన హిమాలయ ప్రయాణమే గామి. దీనికి దేవదాసి ఎపిసోడ్ తో పాటు, హీరోయిన్ ఎపిసోడ్ ను సబ్ ప్లాట్స్ గా లింక్ చేసినట్టున్నారు. చివరికి హీరో మానవ స్పర్శను అనుభూతి చెందాడా లేదా అనేది ఈ సినిమా స్టోరీ.
టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి పీసీఎక్స్ ఫార్మాట్ లో ట్రయిలర్ ను తీసుకొచ్చిన మేకర్స్, విజువల్ వండర్ ను కళ్లముందు ఆవిష్కరించారు. హిమాలయ ప్రయాణంలో భాగంగా కొన్ని సాహసాలు కూడా చూపించారు.
విద్యాధర్ కాగిత డైరక్ట్ చేసిన ఈ సినిమాకు నరేష్ కుమారన్ సంగీతం అందించగా, విశ్వనాధ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. వీళ్లిద్దరి వర్క్ ట్రయిలర్ లో హైలెట్ గా నిలిచింది. మార్చి 8న థియేటర్లలోకి వస్తోంది గామి.