క్రిష్ పైనే అందరి కళ్లు.. వస్తాడా, రాడా..?

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో అనూహ్యంగా క్రిష్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎఫ్ఐఆర్ లో క్రిష్ ను కూడా నిందితుడిగా చేర్చిన పోలీసులు, అతడ్ని విచారణకు పిలిచారు. అయితే తను విచారణకు…

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో అనూహ్యంగా క్రిష్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎఫ్ఐఆర్ లో క్రిష్ ను కూడా నిందితుడిగా చేర్చిన పోలీసులు, అతడ్ని విచారణకు పిలిచారు. అయితే తను విచారణకు హాజరుకాలేనని, త్వరలోనే వస్తానని క్రిష్ పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో అతడిపై మరిన్ని అనుమానాలు పెరుగుతున్నాయి.

లెక్కప్రకారం రేపు విచారణకు హాజరుకావాలి క్రిష్. కానీ ఇప్పుడు దీనిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేపు విచారణకు వస్తాడని కొందరు చెబుతుంటే, మరికొందరు మాత్రం అతడు సోమవారం విచారణకు వస్తాడని చెబుతున్నారు. ప్రస్తుతం దీనిపై క్లారిటీ లేదు.

మరోవైపు క్రిష్ ఇలా గ్యాప్ తీసుకోవడాన్ని కూడా కొంతమంది అనుమానిస్తున్నారు. డ్రగ్స్ తీసుకున్న వెంటనే పరీక్షలు నిర్వహిస్తే, కచ్చితంగా ఆనవాళ్లు దొరుకుతాయి. మాదకద్రవ్యాలు తీసుకున్న 2 రోజుల వరకు రక్తంలో వాటి ఆనవాళ్లు ఉంటాయి. ఇక మూత్రం, ఉమ్మిలో 3 రోజుల వరకు ఆనవాళ్లు ఉంటాయి.

ఇలా పరీక్షల్లో దొరక్కుండా తప్పించునేందుకే క్రిష్ కావాలని గ్యాప్ తీసుకున్నట్టు కొందరు చెబుతున్నారు. అయితే నిపుణులు మాత్రం మాదకద్రవ్యాలు సేవించిన 4 రోజుల తర్వాత కూడా శాంపిల్స్ నుంచి ఆనవాళ్లు సంగ్రహించొచ్చని చెబుతున్నారు. ఇక రెగ్యులర్ గా డ్రగ్స్ తీసుకునే వ్యక్తుల్లోనైతే వాళ్ల తల వెంట్రుకల్లో 90 రోజుల పాటు డ్రగ్స్ ఆనవాళ్లు ఉంటాయి.

విచారణకు వచ్చిన రోజునే క్రిష్ నుంచి శాంపిల్స్ తీసుకోబోతున్నారు పోలీసులు. దీనికి కోర్టుల అనుమతి అక్కర్లేదు. మరి క్రిష్ రేపు విచారణకు హాజరవుతాడా..? మరికొన్ని గంటల్లో ఈ చిక్కుముడి వీడనుంది. అతడు పోలీసుల ముందుకొస్తే, మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.