ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చిది అని ముద్ర వేయడం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి మార్కు వ్యూహం అనేది దశాబ్దాలుగా తెలుగు రాజకీయంలో వినిపిస్తున్న మాటే! ఇప్పుడు ఈ విషయంలోనే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జిలు గగ్గోలు పెడుతూ ఉండటం గమనార్హం! ఎన్నికలకు గట్టిగా ఇంకో నెలన్నర సమయం అయినా ఉందో లేదో కానీ, ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ పద్ధతిలో సర్వేలు చేస్తూ ఉండటం ఆ పార్టీ ఇన్ చార్జిల్లో అలజడి పుట్టిస్తూ ఉంది!
ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాల సంగతలా ఉంటే, ఇప్పటి వరకూ ప్రకటన రాని వాటిల్లో ఇంకా కాల్స్ వెళ్తూనే ఉన్నాయట! చంద్రబాబు నాయుడు వాయిస్ తో తెలుగుదేశం అభ్యర్థుల్లో ఎవరి అభ్యర్థిత్వానికి మద్దతో చెప్పాలంటూ ఈ కాల్స్ వెళ్తుంటాయి. ఇది చంద్రబాబు చాలా కాలంగా చేస్తున్న రాజకీయమే!
ఈ ఐవీఆర్ఎస్ లో ఎవరికి అనుకూలత వస్తే వారికే టికెట్ అనేది పైకి చెప్పే అంశం! ఇదెంత కామెడీ అంటే, ఇప్పటి వరకూ అభ్యర్థులను ప్రకటించిన చోట్ల ఈ ఐవీఆర్ఎస్ సర్వేల మాటేంటనేది ప్రశ్నార్థకం! తాము అనుకున్న అభ్యర్థులను సాఫీగా ప్రకటించుకోగల చోట ఈ ఐవీఆర్ఎస్ ఊసు లేదు, ఎక్కడైతే.. ఎవరో ఒకరిని పక్కన పెట్టాలనుకున్న చోట మాత్రం ఈ రచ్చ జరుగుతూ ఉంది!
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇదో సీరియల్ లా సాగుతూ ఉంది. పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి విషయంలో మూడు నెలలుగా ఈ టెలిఫోన్ సర్వే కొనసాగుతూనే.. ఉంది! తమకు తెలుగుదేశం కాల్స్ వస్తున్నాయని, పల్లె రఘునాథరెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు ఉందో లేదో చంద్రబాబు సర్వే జరుగుతోందంటూ రెండు మూడు నెలల కిందటే అక్కడి వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు! విశేషం ఏమిటంటే.. ఇంకా అక్కడ ఆ సర్వే కొనసాగుతూనే ఉంది!
ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఇలాంటి సర్వేల ఊసే లేకుండా ఒక కాంట్రాక్టరుకు అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు, అది కల్యాణదుర్గం విషయంలో. అక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి కుటుంబం టికెట్ ఆశిస్తోంది. మరి అక్కడేమో సర్వే ఊసే లేకుండా వేరే అభ్యర్థిని ప్రకటించారని, మిగతా చోట్ల మాత్రం సర్వేల పేరుతో ఇన్ చార్జిలను బెదరగొడుతున్నారనేది పొలిటికల్ టాక్!