భారత దేశం అంటేనే లౌకిక దేశమని ఆ ముద్రలు గత పదేళ్ల బీజేపీ పాలనలో పూర్తిగా చెరిగిపోయాయని కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ విమర్శించారు.
విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఒకే మతం ఉందని బీజేపీ పాలకులు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ హాజరై పూజారిగా వ్యవహరించారని భారత్ కేవలం ఒక మతానికి పరిమితం అయినట్లుగా అర్ధం వచ్చేలా ప్రవర్తించారని అయ్యర్ మండిపడ్డారు.
మోడీ కంటే గొప్ప రామభక్తుడు మహాత్ముడని ఆయన హిందూ ముస్లిం ఐక్యతను కోరుకున్నారని గుర్తు చేశారు. దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ దేశంలో మతాలకు అతీతంగా లౌకిక పాలన ఉండాలని కోరుకున్నారని అలాగే తన పాలనను అందించారని ఆయన వివరించారు.
మహాత్ముని మరణం వెనక ఉన్న గాడ్సే సావర్కర్ ఆశీస్సులు తీసుకునే హత్య చేశారు అని అయ్యార్ తీవ్ర ఆరోపణలు చేశారు. గాంధీకి నిజమైన రాజకీయ వారసుడు నెహ్రూ అని అయ్యర్ కితాబు ఇచ్చారు. దేశాన్ని లౌకిక పునాదుల మీద కాంగ్రెస్ పాలకులు నిర్మాణం చేస్తే బీజేపీ దాన్ని దెబ్బతీస్తోందని ఆయన ఫైర్ అయ్యారు.
దేశంలో 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని లౌకిక శక్తులను అధికారంలోకి తీసుకుని రావాలని ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారు. భారత దేశాన్ని బీజేపీ నుంచి రక్షించుకోవాలని ఆయన కోరారు. ప్రపంచంలోని అతి పెద్ద లౌకిక గణతంత్ర ప్రజాస్వామిక దేశం భారత్ అని ఆ ముద్రను కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.