టీడీపీని బ్రాహ్మణులు ఓడిస్తారు!

తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణులు ఓడించి తీరాలని బ్రాహ్మణ సంఘం నాయకులు పిలుపు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలోని వచ్చాక బ్రాహ్మణులకు ఒక్క సీటుని కూడా ఇవ్వలేదని వారు గుర్తు చేస్తున్నారు.…

తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణులు ఓడించి తీరాలని బ్రాహ్మణ సంఘం నాయకులు పిలుపు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలోని వచ్చాక బ్రాహ్మణులకు ఒక్క సీటుని కూడా ఇవ్వలేదని వారు గుర్తు చేస్తున్నారు. పైగా బ్రాహ్మణులను కించపరచే విధంగా మాట్లాడిన మహాసేన రాజేష్ కి తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం టికెట్ ని కేటాయించడం బాబు చేసిన పెద్ద తప్పు అని వారు అంటున్నారు.

తక్షణం మహాసేన రాజేష్ కి ఇచ్చిన టికెట్ ని వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. గతంలో జరిగిన క్రైస్తవుల సభలో అగ్రవర్ణ అమ్మాయిలను ప్రత్యేకించి బ్రాహ్మణ అమ్మాయిలను ప్రేమించి వివాహం చేసుకుంటే లక్షల్లో బహుమతి ఇస్తానని, అలాగే వారు విదేశాల్లో సుఖంగా బతకడానికి నివాసం కల్పిస్తానని బహిరంగంగా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అవమానపరిచేటట్లు మాట్లాడిన మహాసేన రాజేష్ కు వచ్చే ఎన్నికలలో టీడీపీ టికెట్ ను కేటాయించడం సిగ్గుచేటని విశాఖకు చెందిన శ్రమ శక్తి అవార్డు గ్రహీత వీవీ వామనరావు ఘాటుగా విమర్శించారు.

ఇటువంటి చర్యల ద్వారా మరోసారి తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణుల పట్ల చులకన భావాన్ని బహిర్గతం చేసినట్లు అయిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు మొదటి నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే అసలు లెక్క లేదని ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు బ్రాహ్మణులను చేరదీసి, వాళ్ళ అభివృద్ధికి కృషి చేయలేదని గతాన్ని గుర్తు చేశారు.

పైగా బ్రాహ్మణులను దారుణంగా అవమానించిన వారికి టికెట్లు ఇవ్వడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని ప్రశ్నించారు. వారికే  ఎన్నికల్లో ప్రోత్సహించడం ద్వారా మరోసారి బ్రాహ్మణుల పట్ల చంద్రబాబు నైజం బయటపడిందని ఆయన అన్నారు. వెంటనే చంద్రబాబు నాయుడు తన తప్పు తెలుసుకొని మహాసేన రాజేష్ కు కేటాయించిన టిక్కెట్టును రద్దుచేయాల్సింద అని డిమాండ్ చేశారు.

లేకపోతే రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఓడించడానికి యావత్ బ్రాహ్మణ సామాజిక వర్గం వెనకడుగు వేయదని ఆయన హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి  బ్రాహ్మణ సామాజిక వర్గం పట్ల ఏమాత్రం గౌరవ మర్యాదలు ఉన్నా వెంటనే తగిన చర్యలకు ఉపక్రమించాలని కోరారు. ఇదే విషయం మీద బ్రాహ్మణ సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.