సర్.. గతేడాది ఫిబ్రవరిలో మూవీ. డీజే టిల్లూ.. 2022 ఫిబ్రవరిలో ఓ ఊపు ఊపింది. ఇక 2021 ఫిబ్రవరిలో ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2020 ఫిబ్రవరిలో నితిన్ హీరోగా నటించిన భీష్మ సినిమా సూపర్ హిట్టయింది. ఇలా గడిచిన మూడేళ్లుగా ఏటా ఫిబ్రవరికి ఓ సూపర్ హిట్టు పడుతోంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో మాత్రం ఈ రేంజ్ హిట్ ఒక్కటి కూడా లేదు.
ఫిబ్రవరి బాక్సాఫీస్ మరీ తీసికట్టుగా మొదలైంది. బూట్ కట్ బాలరాజు, ధీర, గేమ్ ఆన్, కిస్మత్, హ్యాపీ ఎండింగ్ లాంటి సినిమాలు మొదటి వారంలో థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో ఏదీ ఆకట్టుకోలేకపోయింది. మీ జీతాలతో మా జీవితాలు నిలబెట్టండి అంటూ బూట్ కట్ బాలరాజు మూవీ కోసం సోహైల్ చేసిన ప్రచారం పనికిరాలేదు. ఇక నవ్వులు పంచుతున్దనుకున్న కిస్మత్ కూడా తేలిపోయింది. మిగతా సినిమాల సంగతి సరేసరి.
ఉన్నంతలో ఈవారం రిలీజైన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమా యావరేజ్ అనిపించుకుంది. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు గట్టిగా ప్రచారం చేశారు. ప్రారంభంలో బాగానే ఊపు కనిపించింది, ఆ తర్వాత మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
రెండో వారంలో యాత్ర-2, ఈగల్, ట్రూ లవర్, లాల్ సలామ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో రవితేజ నటించిన ఈగల్ సినిమా అస్సలు మెప్పించలేకపోయింది. భారీ ప్రచారంతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు. పబ్లిక్ బ్లాక్ బస్టర్ అంటూ పోస్టర్ వేసుకున్నప్పటికీ ఫలితం ఏంటనేది అందరికీ తెలుసు.
ఇక ఇదే వారంలో ఈగల్ తో పాటు వచ్చిన మరో సినిమా లాల్ సలామ్. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ సినిమా, అతడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. రజనీ కెరీర్ లోనే ఇంత డిజాస్టర్ మూవీ చూడలేదంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారంటే లాల్ సలామ్ పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ సినిమాల కంటే ఒక రోజు ముందే థియేటర్లలోకి వచ్చింది యాత్ర-2. వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానాన్ని చూపిస్తూ తీసిన ఈ సినిమా ఓ సెక్షన్ ఆడియన్స్ ను మాత్రమే ఆకట్టుకుంది. రెవెన్యూ పరంగా చూసుకుంటే ఇది డిజాస్టర్ కింద లెక్క.
మూడో వారంలో మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ కాస్త కుదుటపడింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా, బాక్సాఫీస్ కు కాస్త కళ తీసుకొచ్చింది. మొదటి రోజు మిక్స్ డ్ టాక్ తో మొదలై, ఆ తర్వాత పుంజుకుంది. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఇదే హీరో గతేడాది ఇదే నెలలో పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు, తిరిగి ఈ ఏడాది సేమ్ మంత్ లో ఊరు పేరు భైరవకోన సినిమాతో హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే ఇది సూపర్ హిట్టు రేంజ్ మూవీ కాదు.
ఇక మూడో వారంలో వచ్చిన రాజధాని ఫైల్స్, డ్రిల్, ఐ హేట్ లవ్ లాంటి సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. వీటిలో ప్రత్యేకంగా రాజధాని ఫైల్స్ గురించి చెప్పుకోవాలి. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అమరావతి ఇష్యూ చుట్టూ తీసిన ఈ సినిమా కనీసం రాజధాని ప్రాంతంలో కూడా ఆడలేదు.
ఇక ఇదే వారం సీతారామం, ఓయ్ సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి. ప్రేమికుల రోజు కానుకగా వచ్చిన ఈ సినిమాలు కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు. స్వయంగా సిద్దార్థ్ బయటకొచ్చి ప్రచారం చేయడంతో, ఓయ్ సినిమా ఒక షో మాత్రం బాగా ఆడిందంతే.
ఫిబ్రవరి చివరివారంలో సుందరం మాస్టర్, ముఖ్య గమనిక, 14 డేస్ లవ్, సిద్దార్థ్ రాయ్, భ్రమయుగం, మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా సినిమాలు రిలీజ్ అయ్యాయి. రవితేజ నిర్మాతగా కమెడియన్ హర్ష హీరోగా తెరకెక్కిన సుందరం మాస్టర్ ఫ్లాప్ అయింది. మమ్ముట్టి నటించిన భ్రమయుగం సినిమా కొంతమందికి మాత్రమే నచ్చగా.. ఛైల్డ్ ఆర్టిస్ట్ దీపక సరోజ్ హీరోగా మారి తీసిన సిద్దార్థ్ రాయ్, మరో కమెడియన్ అభినవ్ గోమటం హీరోగా మారి తీసిన మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఓవరాల్ గా ఫిబ్రవరిలో ఒక్క బ్లాక్ బస్టర్ లేదు.