ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవాల్సిందే. ఇంకా ఇది ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్య జమానా కాదు. కాపు సామాజిక వర్గంలో ఇప్పుడు యువత ప్రాబల్యం పెరిగింది. ఏనాడో కాపునాడు అంటూ ముందుకు నడిచిన నాయకులు ఇక ఇప్పుడు తమ మర్యాద కాపాడుకునే విధంగా వ్యవహరించాల్సిందే.
కొత్త నీరు వచ్చినపుడు పాత నీరు పక్కకు పోవాల్సిందే. అది సృష్టి ధర్మం. ఇప్పుడు కాపు సామాజిక వర్గ సీనియర్ నాయకుల పరిస్థితి అదే. వారితో కలిసి నడిచిన వారో, వారి సహచరులో కాస్త ఆలోచించి అయ్యో అనుకుంటే అనుకోవచ్చు తప్ప, ఈ తరం కాపు యువత మాత్రం సీనియర్ల వైపు దృష్టి సారించడం లేదు. వాళ్లు సాగించిన పోరాటాలు గుర్తు చేసుకోవడం లేదు.
నిన్నటికి నిన్న పవన్ ప్రసంగంతో జనసేన యువత చాలా వరకు సమాధానపడిపోయారు. అవును కదా, డబ్బులు లేవు, కేడర్ లేదు 24 సీట్లకు మించి తీసుకుని ఏం చేస్తాం అన్నట్లు మాట్లాడుతున్నారు. అంతే తప్ప కాపు సామాజిక వర్గ ఓట్ల బలం అంతా కలిసి జస్ట్ 24 సీట్లకోసం అప్పనంగా అప్పచెబుతున్నారన్న ఆలోచన లేదు. పవన్ బాగా మాట్లాడారు కదా… అని వారిలో వారు శహభాష్ అనేసుకుంటున్నారు.
అక్కడితో ఆగినా బాగుండును. ఎవరైతే పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ వున్నారో, అది కూడా కాపు సామాజిక వర్గం నుంచి వున్న వారు ఈ సీనియర్ నాయకులను తమ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో దుయ్యబడుతున్నారు. గమ్మత్తేమిటంటే జనసేన అండతో గద్దె సాధించాలి అనుకుంటున్న తెలుగుదేశం అను కుల సామాజిక వర్గం సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా కాంపు సీనియర్ నేతలను విమర్శిస్తున్నాయి.
ఇప్పుడు కాపు యువత చాలా వరకు పవన్ మత్తులో వున్నారు. అది అభిమానమనే మత్తు. అది దిగే వరకు ఎవరు ఎన్ని చెప్పినా వారికి అనవసరం. వాళ్ల నాయకుడు చెప్పిందే శాసనం. ఇలాంటి సమయంలో వారి దారికి అడ్డం పడితే పరువు పోగొట్టుకోవడం మినహా మిగిలేది ఏమీ వుండదు కాపు సామాజిక వర్గ సీనియర్ నేతలకు. ఇప్పుడు వాళ్లకు ఇది విశ్రాంతి సమయం. అది తాత్కాలికమా, సుదీర్ఘమా అన్నది కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు కాపు యువతకు కొత్త దేవుడు పవన్. అది అంగీకరించాల్సిందే.