తెలుగు చిత్రసీమకు పరీక్షా కాలమ్ మొదలైంది. సాధారణంగా బాక్సాఫీస్ బరిలో ఒక సినిమాతో మరో సినిమా పోటీ పడినప్పుడు పరీక్ష ఉంటుంది. కానీ ఈ నెలలో టాలీవుడ్ కు ఆ సమస్య లేదు. ఎటొచ్చి వెలుపల నుంచి అనుకూల అంశాల కంటే ప్రతికూల అంశాలు ఎక్కువగా ఉన్నాయి.
వీటిలో ముఖ్యమైంది పరీక్షలు. తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ సీజన్ మొదలైంది. తెలంగాణలో ఆల్రెడీ ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలవ్వగా.. ఆంధ్రప్రదేశ్ లో రేపట్నుంచి పరీక్షల సీజన్ షురూ అవుతోంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలతో విద్యార్థులు దాదాపు ఈ నెలంతా బిజీగా ఉండబోతున్నారు. ఇదే నెలలో 10వ తరగతి పరీక్షలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో, ఈ కుటుంబాలన్నీ బాక్సాఫీస్ కు దూరం అవుతున్నాయి.
పరీక్షలతో పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ కు మరో స్పీడ్ బ్రేకర్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఊపందుకుంది. ఇంకా కోడ్ అమల్లోకి రానప్పటికీ, ఇప్పటికే పార్టీలన్నీ సభలతో హోరెత్తిపోతున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక చోట ర్యాలీ జరుగుతోంది. ఎక్కువ యువత రాజకీయాల వైపే చూస్తోంది. అలా సినిమా హాళ్లలో ఆక్యుపెన్సీ తగ్గిపోయింది.
ఇక్కడితో అయిపోలేదు. టాలీవుడ్ కు మరో ప్రధాన అడ్డంకి ఐపీఎల్ రూపంలో రెడీగా ఉంది. ఇలా పరీక్షలు ముగియడం ఆలస్యం, అలా ఐపీఎల్ స్టార్ట్ అవుతోంది. ఏప్రిల్ నెల మొత్తం ఐపీఎల్ హవా కొనసాగేలా ఉంది. ఐపీఎల్ మొదలైతే ఈవెనింగ్ ఆటలకు ఆక్యుపెన్సీ ఎలా తగ్గిపోతుందో గతంలోనే చూశాం, ఈసారి కూడా అదే రిపీట్ కాబోతోంది.
వీటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు కాంపిటీటివ్ పరీక్షలు కూడా రాగల 2-3 నెలల్లో ఉన్నాయి. తాజాగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇవన్నీ కలిపి తెలుగు రాష్ట్రాల్లో సినిమాల సందడిని కాస్త తగ్గించనున్నాయి. ఆపరేషన్ వాలంటైన్ తో మార్చి నెల బాక్సాఫీస్ మొదలవుతోంది. గామి, ఓం భీమ్ బుష్, టిల్లూ స్క్వేర్ లాంటి సినిమాలున్నాయి ఈ నెలలో.