వామనుడు ఎప్పటికీ వామనుడే?

వామనుడు త్రివిక్రముడిగా మారితే అదో అద్భుతం. అదే వామనుడు ఎప్పటికీ వామనుడిగానే వుండిపోతే అది అశనిపాతం. జనసేనాని పవన్ కళ్యాణ్ తనను తాను వామనుడితో పోల్చుకున్నారు. త్రివిక్రముడిగా మారి జగన్ ను అద: పాతాళానికి…

వామనుడు త్రివిక్రముడిగా మారితే అదో అద్భుతం. అదే వామనుడు ఎప్పటికీ వామనుడిగానే వుండిపోతే అది అశనిపాతం. జనసేనాని పవన్ కళ్యాణ్ తనను తాను వామనుడితో పోల్చుకున్నారు. త్రివిక్రముడిగా మారి జగన్ ను అద: పాతాళానికి తొక్కేస్తా అంటూ రంకెలు వేసారు. సరే, రాజకీయాల్లో ఎవరి బీరాలు వారివి.

మనకు కార్యకర్తలకు టీ తాగించే సత్తా లేదు. టిఫిన్ పెట్టగలిగిన స్తోమత లేదు. నియోజకవర్గాల్లో కేడర్ లేదు. ఇంకా అది లేదు. ఇది లేదు.. అన్నది కూడా పవన్ నే. అందుకే 24 సీట్లతో సరిపెట్టుకున్నా అంటున్నారు. నిజానికి పవన్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ 24 సీట్లు కూడా ఎక్కువే. ఏవీ లేని వారికి ఎందుకు అన్ని సీట్లు.

సరే ఆ సంగతి అలా వుంచుదాం. ఎదిగే క్రమంలో వున్నాం మనం అన్నారు పవన్. నిజమే. కానీ ఎదిగే క్రమం అంటూ ఒకటి వుంటుంది. 2014 తెలుగుదేశంతో పొత్తు.. 2019 ఓంటరి పోరు. 2024 మళ్లీ తెలుగుదేశంతో పొత్తు. మరి 2029? అయితే తెలుగుదేశంతో పొత్తు కొనసాగింపు కావాలి. లేదా ఒంటరి పోరు. ఎందుకు ఒంటరి పోరు అవుతుంది అంటే. కాస్త ఎదిగాము, 24 సీట్లు కాకుండా 74 సీట్లు ఇవ్వమని అడిగితే నో అంటే..

ఈ సంగతి తెలుగుదేశం ఊహకు అందనిదా? నిజంగా జగన్ ను తొక్కేసి, చంద్రబాబుకు అధికారం అందిస్తే, వామనుడు మరో నాలుగేళ్లలో త్రివిక్రముడిగా మారిపోతాడేమో అన్న భయం వుండదా? అనేక రాజకీయ యుద్దములందు ఆరితేరిన వృద్దుడు చంద్రబాబు. పవన్ సంగతి పసిగట్టలేని వారా? ఎదగకుండా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూనే వుంటారు. లేదు, ఎదిగే ఆలోచనే లేదు అనుకుందాం. అప్పుడు ఇదే క్యేడర్ 2029లో ఏమనుకుంటుంది? అప్పుడు కూడా ఈ వామనుడి వెంటే వుంటుందా? ఇప్పుడే ఎంతో కొంత శాతం మంది ఏమిటిది అనుకుంటున్నది వాస్తవం కాదా?

సరే 2029కి చంద్రబాబు వదిలేసి, తాను వామనుడిని ఐపోయాను అంటారా? అప్పుడు వుంటుంది మజా. నిన్నటికి నిన్న పవన్ ను ఆకాశానికి ఎత్తిన పచ్చ మీడియా ఎర్రగా చూస్తుంది. అప్పుడు ఒక్క గంట చాలు పవన్ ను వామనుడికన్నా చిన్నగా చేసేయడానికి. జగన్ నే తట్టుకోలేక కిందా మీదా అవుతున్నారు ఆ ఎల్లో మీడియా ధాటికి. పవన్ కొన్ని గంటలు కూడా తట్టుకోలేరు.

అందువల్ల ఏతా వాతా చూస్తే పవన్ అనే వామనుడు ఎప్పటికీ త్రివిక్రముడు కాలేడు. ఎందుకంటే లేస్తే మనిషిని కాను అనే హూంకరింపులు తప్ప, త్రివిక్రముడు అయ్యేంత సీన్ పవన్ కు ఎప్పటికీ లేదని ఆయనకే క్లారిటీ వుంది. అదే క్లారిటీ అందరికీ వుంది. పవన్ కు చాతనైంది ఒకటే తన వెనుక వున్న సామాజిక బలాన్ని చంద్రబాబుకు అరవివ్వడమో, తాకట్టుపెట్టడమో మాత్రమే.