ఈయనదీ లోక్‌స‌త్తా జేపీ బాటేనా?

ఆదర్శాలు వల్లించేవారు ఈ కాలంలో రాజకీయాలకు పనికిరారు. అనేక మంది విషయంలో ఇది రుజువైంది. సుపరిపాలన అన్నవారు సుస్థిరంగా రాజకీయాలు చేయలేరు. ఇది ప్రజలకూ తెలుసు. కొందరు ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులు ఏవేవో ఆదర్శాలతో,…

ఆదర్శాలు వల్లించేవారు ఈ కాలంలో రాజకీయాలకు పనికిరారు. అనేక మంది విషయంలో ఇది రుజువైంది. సుపరిపాలన అన్నవారు సుస్థిరంగా రాజకీయాలు చేయలేరు. ఇది ప్రజలకూ తెలుసు. కొందరు ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులు ఏవేవో ఆదర్శాలతో, ఈ వ్యవస్థను అసహ్యించుకొని, దీన్ని సంస్కరించాలనే తపనతో, ఆవేశంతో ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వస్తుంటారు.

ఉన్న రాజకీయ పార్టీల్లోనే  దేంట్లోనో ఒకదానిలో చేరుతారు. కొందరు కొత్తగా పార్టీ పెడతారు. ఇలాంటివారు ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ప్రజల ఆదరణ పొందుతారు. మంచి అధికారిగా గుర్తింపు పొందుతారు. అధికారి అంటే ఇలా ఉండాలని జనం వారికి బ్రహ్మరథం పడతారు. ఇలాంటివారు ఉద్యోగంలో ఉన్నప్పుడు సూపర్​స్టార్​ ఇమేజ్​ సంపాదించుకుంటారు. కాని ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తారో ఇక జనం వీరిని పట్టించుకోరు. వీరు ఎన్నికల్లో పోటీ చేసినా గెలవరు. కొన్నాళ్లు రాజకీయాల్లో కొనసాగి తరువాత తెరమరుగవుతారు.

ఒకప్పుడు సిన్సియర్​ ఐఏఎస్​ ఆఫీసరుగా పేరు సంపాదించుకొని, అధికారిగా ప్రజల ఆదరణ పొందిన డాక్టర్​ జయప్రకాశ్​ నారాయణ లోక్​సత్తా పార్టీ పెట్టి ఒక్కసారి ఎన్నికల్లో గెలిచి, ఆ తరువాత కనుమరుగయ్యారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సీబీఐ జేడీగా పనిచేసిన వి.వి.లక్ష్మీనారాయణ ఉన్నారు. ఎన్నికలకు ఎక్కువ‌ టైమ్ లేని సమయంలో ఆయన  కొత్తగా  జై భారత్ నేషనల్ పార్టీని  పెట్టారు.  కాని దాన్ని ప్రజల్లోకి  తీసుకెళ్లగలరా? సీబీఐ అధికారిగా ఉన్నప్పుడు లక్ష్మీ నారాయణ, ప్రస్తుత సీఎం జగన్‌ని టార్గెట్ చేశారు. ఆయనపై ఉన్న కేసుల్ని వృత్తి రీత్యా డీల్ చేశారు.

అలాంటి జేడీ, ఎప్పటికీ వైసీపీతో జట్టు కట్టరన్నది అందరికీ తెలిసిన విషయం. అలాగని ఆయన టీడీపీ వైపో, జనసేన వైపో చూడలేదు. ఇవన్నీ సరైన పంథాలో వెళ్తున్న పార్టీలు కాదని భావించిన ఆయన.. సుపరిపాలన కోసమే అంటూ.. జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. పార్టీ పేరులో భారత్, నేషనల్ అనే పదాలను ఉంచడం ద్వారా తనది ప్రాంతీయ పార్టీగా కాకుండా.. జాతీయ పార్టీగా ఆయన ప్రమోట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

పార్టీ పెట్టినప్పుడు ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. దానికి ఆయన సమాధానం ఇచ్చారు. “రాజకీయాలు అంటే సుపరిపాలన అని నిరూపిస్తాం.  అవినీతిని అంతమొందించేందుకే వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తుంది, అభివృద్ధితో అవసరాలు ఎలా తీర్చుకోవాలో నేర్పిస్తుంది. ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలూ విఫలమయ్యాయి. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడానికి పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ. కుంటుంబపాలన చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. మేం తప్పు చేయం.. అప్పు చేయం. చీకటిలో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపడానికి వచ్చిందే జై భారత్ నేషనల్ పార్టీ” అని జేడీ స్పష్టంగా చెప్పారు. 

జేడీ ఉద్దేశాన్ని బట్టి మంచి ఆదర్శ భావాలతోనే పార్టీ పెట్టారని అర్థమవుతోంది. ఐతే.. ఎన్నికలకు చాలా తక్కువ టైమ్ ఉంది. ఈ పార్టీ ప్రజలకు ఏ మాత్రం రీచ్ అవుతుంది? ప్రజలు దీన్ని ఎలా స్వాగతిస్తారు? ఇప్పటికే ఉన్న పార్టీలకు కాకుండా.. కొత్త పార్టీకి ఓటు వేస్తారా? అనే ప్రశ్నలున్నాయి. జనరల్‌గా ప్రజల్లో ఓ ఒపీనియన్ ఉంటుంది. కొత్తగా వచ్చిన పార్టీ ఎలాగూ అధికారంలోకి రాదు.. కాబట్టి తమ ఓటు వేస్ట్ అయిపోతుందనే ఉద్దేశంతో.. వారు ప్రస్తుత ఎన్నికల్లో సంప్రదాయ పార్టీలకే ఓటు వేస్తారనే భావన ఉంది. దీనికి జేడీ పార్టీ బ్రేక్ వేస్తుందా? ప్రస్తుత కాలంలో పార్టీని నడపాలంటే ఆషామాషీ కాదు. ఈ నేపథ్యంలో  జేడీ లక్ష్మీనారాయణ  కొత్త రాజకీయ పార్టీని ప్రకటించి ఆశ్చర్చపరించారు. కొత్త పార్టీ పెట్టినంత మాత్రాన జనం ఆదరిస్తారా ? ఎన్నికల్లో ఓటు వేస్తారా అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఎందుకంటే మహా మహా నేతలే రాజకీయ పార్టీలను నడిపించలేక ఇతర పార్టీల్లో విలీనం చేసిన పరిస్థితులు చూశాం. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ నడపాలంటే బలమైన ఆర్థిక, అంగబలం ఉండాలి. నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. బలమైన నేతలను ఎన్నికల్లో నిలబెట్టాలి. ప్రస్తుతం ఏపీలో వైసీపీ, తెలుగుదేశం పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. ఆ రెండు పార్టీలకు ఆర్థిక బలంతో పాటు గ్రామస్థాయిలో కేడర్ కూడా ఉంది. వీటితో పాటు ఇటీవల బలంగా పుంజుకుంటున్న జనసేన, జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయి. ఈ పార్టీలను కాదని జై భారత్ నేషనల్ పార్టీ వైపు నిలబడతారా..? మాజీ ఐపీఎస్ అధికారిగా లక్ష్మీనారాయణను అభిమానించే వారంతా ఓట్లు వేస్తారా అన్నదే ఆసక్తికరంగా మారింది. 

ఎందుకంటే సినిమా హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కల్యాణ్‌.. జనసేన పార్టీని స్థాపించి పదేళ్లు అవుతున్నా ఇంతవరకు అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్‌ కల్యాణే ఓడిపోయారు. ఎంతో కష్టంతో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రస్తుత రాజకీయాలు తట్టుకోలేక విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కూడా సొంత పార్టీలు పెట్టి కనుమరుగైనవారు ఉన్నారు. వీరిలో జయప్రకాశ్ నారాయణ లోక్ సత్తా పార్టీ పెట్టి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ప్రజలు ఆ పార్టీని పట్టించుకోలేదు.

ఇటీవలే తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడిషనల్ డీజీ ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో సిర్పూర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న కేజ్రీవాల్ మాత్రమే పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు ఎంపికయ్యారు. అలాగే పంజాబ్ రాష్ట్రంలోనూ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అలాంటిది ప్రస్తుతం ఆయన కూడా లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ నోటీసులు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ సొంతంగా పార్టీని ఎంతవరకు నడపగలరు?