ఆర్జీవీ వ్యూహం సినిమా సెన్సారు గండాలు దాటుకుని విడుదలకు సిద్దమైంది. కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఆరున రివైజ్డ్ సెన్సారు కోసం అధికారులు సినిమా చూసిన తరువాత సర్టిఫికెట్ ఇవ్వడానికి దాదాపు మూడు వారాలు పట్టింది.
దీని వెనుక ఎన్ని ఉత్తర ప్రత్యుత్తరాలో, ఎన్ని కొత్త కొత్త కట్ లో, ఎన్ని కొత్త కొత్త మ్యూట్ లో నిర్మాత, దర్శకులకే తెలియాలి. ఎందుకిలా జరిగింది ఈ సినిమాకు అంటే వర్తమాన రాజకీయ నాయకులు అందరూ ఈ సినిమాలో కనిపిస్తారు కదా. అదే సమస్య కావచ్చు.
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం రోజు రోజుకూ కొత్త కట్ లు, మ్యూట్ లు చెబుతూ జాప్యం చేస్తూ వచ్చారని, అయినా కూడా నిర్మాత పట్టుదలగా ముంబాయిలో కూర్చుని సర్టిఫికెట్ తెచ్చుకు వచ్చారు. శుక్రవారానికి బదులుగా శనివారం విడుదల చేస్తున్నారు. కానీ ఈ సినిమా కష్టాలు ఇక్కడితో అయిపోలేదు.
వ్యూహం సినిమా రెండో భాగం శపథం సెన్సారు ఇంకా వుండనే వుంది. అది చూడాలి. ముంబై అధికారులు దానికి ఎన్ని అభ్యంతరాలు చెబుతారో? ఏం జరుగుతుందో, ఎనిమిదిన విడుదల అయిపోతే ఫరవాలేదు. లేదంటే మళ్లీ కోడ్ అడ్డం పడే అవకాశం వుంది.
అయినా ఈ వ్యూహం చూస్తే శపథం ఎలా వుండబోతోందో ఓ క్లారిటీ వచ్చేస్తుంది.