అప్పుడెప్పుడో ఏడు సిద్ధాంతాలను నమ్ముకుని రాజకీయాలు చేస్తానని జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రగల్భాలు పలికినట్టు గుర్తు. ఆయన మాటలకు, చేతలకు అసలు సంబంధమే వుండదు. తాను విశ్వమానవుడినని, కులాలు, మతాలకు అతీతమని పదేపదే చెబుతుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కులాలు, మతాల పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని, జాగ్రత్తగా వుండాలని కూడా ఆయన హెచ్చరించడం తెలిసిందే.
ఇన్నేసి నీతులు చెప్పిన పవన్‌కల్యాణ్… చివరికి ఏ ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్నారంటే, కేవలం కులమే. అంతెందుకు తాను పోటీ చేసే స్థానంపై కూడా ఆచితూచి అడుగులేస్తున్నారు. తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంపై సర్వేలు చేయించుకుని మరీ బరిలో దిగుతున్నారని సమాచారం. ఇంత కాలం భీమవరంలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన పవన్, ఇప్పుడు అక్కడి నుంచి మరోచోటికి మకాం మార్చనున్నారని తెలిసింది.
కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు పవన్ నిర్ణయించారని సమాచారం. దీనికి ప్రధాన కారణం పిఠాపురం నియోజకవర్గంలో కాపుల ఓట్లు 90 వేలకు పైగా ఉండడం. అంటే సగం ఓటర్లు కాపులే అని పవన్ గుర్తించారు. దీంతో పిఠాపురంలో అయితే గెలుపు సునాయాసమని ఆయన నమ్ముతున్నారు. గతంలో భీమవరం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు.
ఈ దఫా అక్కడి నుంచి పోటీ చేసినా గెలిచే అవకాశాలుండేవని పలువురు అంటున్నారు. కానీ పవన్‌కే నమ్మకం కుదర్లేదు. ఎందుకంటే వైసీపీ అభ్యర్థి గ్రంధి కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. కాపుల్లో ఆయనకు బలమైన పట్టు వుంది. అంతేకాదు, భీమవరంలో పోటీ చేస్తే క్షత్రియులు, ఇతర సామాజిక వర్గాలు తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తాయని పవన్ భయపడినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నిక రాజకీయంగా తనకు చావు బతుకుల సమస్య కావడంతో భీమవరంలో ప్రయోగానికి పవన్ జంకారు.
భీమవరం కంటే సురక్షితమైన సీటు కూడా ఆయన అన్వేషించారు. పిఠాపురం కంటే గెలుపుపై నమ్మకం కలిగించే నియోజకవర్గం పవన్‌కు కనిపించలేదు. ఇక్కడ అత్యధికంగా కాపులుండడంతో, వారిపై గెలుపు భారాన్ని వేసి పోటీ చేయాలని పవన్ నిర్ణయించినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి.