జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ సీట్లను టీడీపీ కేటాయించింది. ఈ సీట్లే తక్కువని ఒకవైపు జనసేన కార్యకర్తలు, నాయకులు లబోదిబోమంటున్నారు. ఇది చాలదన్నట్టు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది. ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించి, తక్కువ ఖర్చు చేస్తుంటాయి. బడ్జెట్‌లో నిధుల కేటాయింపుతో జనసేనకు టీడీపీ సీట్లు ఇవ్వడాన్ని చూస్తున్నారు.
ప్రధానంగా 24 అసెంబ్లీ సీట్లలో నిఖార్పైన జనసేన నాయకులు ఏ మేరకు నిలబడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు ఐదుగురు అభ్యర్థుల్ని మాత్రమే పవన్‌కల్యాణ్ ప్రకటించారు. ఇందులో అనకాపల్లి సీటును ఇటీవల పార్టీలో చేరిన కొణతాల రామకృష్ణకు ఇవ్వడం టీడీపీలోనే కాదు జనసేనలోనూ అసంతృప్తి వుంది. గత పదేళ్లుగా పార్టీ జెండా మోస్తున్న వారికి కాకుండా, ఎన్నికల సమయంలో చేరిన నేతకు ఇవ్వడం ఏంటని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు.
భీమవరంలో జనసేన పోటీ చేస్తుందని మొదటి నుంచి చెబుతూ… ఇప్పుడు టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే అంజిబాబును బరిలో దింపాలనుకోవడం ఏంటనే ప్రశ్న జనసేన నుంచి వస్తోంది. ఇలా టీడీపీ నుంచి తెచ్చుకుని నిలబెట్టేందుకైతే జనసేన ఎందుకు తీసుకోవాలని నిలదీస్తున్నారు. పేరుకేమో జనసేన ఖాతాలో సీటు వేసి, మళ్లీ టీడీపీ నేతల్నే నిలబెట్టడంపై ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మిగిలిన 19 సీట్లు ప్రకటిస్తే తప్ప చంద్రబాబుతో పవన్ చేసుకున్న లోపాయికారి ఒప్పందం ఏంటో తెలిసే అవకాశం లేదని అంటున్నారు. భీమవరంలో టీడీపీ నేతను నిలబెట్టాలని నిర్ణయించడం ద్వారా, అసలు జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే అనుమానాలకు తావిస్తోందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇలాగైతే జనసేన పతనానికి పవనే కారణమవుతారని సొంత పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు.
ఒకవైపు ఎక్కువ సీట్లు తీసుకుని ఓడిపోవడం కంటే, తక్కువ సీట్లతో సరిపెట్టుకుని , అన్నింటిలో గెలిచి చూపిద్దామని కథలు చెబుతూ, మిత్రపక్ష పార్టీ నేతలను ఎందుకు తెస్తున్నారని మండిపడుతున్నారు.