భారతి కష్టం సాక్షి టీవీని గాడిలో పెడుతోందా?

ఎంత కాదనుకున్నా సాక్షి పత్రిక, సాక్షి టీవీ మీద వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూల మీడియా అనే ముద్ర తప్పకుండా ఉంటుంది. ఆ ముద్రను తొలగించుకోవడానికి వారేమీ ప్రయత్నించరు కూడా. కానీ.. మీడియా సంస్థలను…

ఎంత కాదనుకున్నా సాక్షి పత్రిక, సాక్షి టీవీ మీద వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూల మీడియా అనే ముద్ర తప్పకుండా ఉంటుంది. ఆ ముద్రను తొలగించుకోవడానికి వారేమీ ప్రయత్నించరు కూడా. కానీ.. మీడియా సంస్థలను కనీస మీడియా స్టాండర్డ్స్ ప్రకారం నడుపుతున్నారా లేదా అనేది మాత్రం వారు తప్పకుండా గమనించుకోవాల్సిన అంశమే అవుతుంది.

ప్రత్యేకించి సాక్షిటీవీని తక్షణం సంస్కరించే దిశగా.. ఈ సంస్థల అధినేత వైఎస్ భారతి తీసుకున్న కొన్ని నిర్ణయాలు సానుకూల ఫలితం ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. సంస్థ నెమ్మదిగా గాడిలో పడుతున్నట్టుగా కనిపిస్తోంది.

వైఎస్ భారతి ఇంతకూ ఏం చేశారంటే.. సుమారు రెండు నెలల కిందట ప్రింట్ అలాగే టీవీ చానెల్ లోని వివిధ విభాగాధిపతులు నలభై మందితో ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. చానెల్ కు సారథ్యం వహిస్తున్న వారిని ఇతర అవసరాలకు వాడుకోవాల్సిన అవసరాలు, అలాగే చానెల్ కు కొత్తదనం తీసుకురావాల్సిన, ప్రమాణాలు పెంచాల్సిన అవసరాల గురించి వారితో చర్చించారు.

కొత్త సారథులుగా ఎవరి చేతిలో బాధ్యత పెడితే సంస్థ సజావుగా నడుస్తుందో  సూచనలు, పేర్లు ఇవ్వాల్సిందిగా ఆ నలభై మంది విభాగాధిపతులకు ఒక ఫారమ్ అందించారు. చానెల్ ను గాడిలో పెట్టడానికి బయటినుంచి ఎవరినో తీసుకురాకుండా సంస్థలో ఉన్నవారినే ఎంపిక చేసుకోవాలని కూడా సూచన చేశారు. ఆ సమయంలో సంస్థలోని ఉన్నతహోదాలోని ఒక పెద్దాయన.. ‘రెండు మూడు రోజులు టైం ఇద్దాం’ అని సూచించినప్పటికీ వైఎస్ భారతి ఒప్పుకోకుండా.. అందరితోనూ అప్పటికప్పుడు అదే సమావేంలో ఫారమ్ పూర్తి చేయించుకుని తీసుకున్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన నెల రోజుల తర్వాత మార్పులు మొదలయ్యాయి.

ఇద్దరి చేతిలో కీలకంగా బాధ్యతలు పెట్టారు. అదివరకటి సారథులు చేసిన తప్పులను సరిదిద్దుతూ చానెల్ ను ముందుకు తీసుకువెళ్లే క్రమంలో సుమారు పది మందికి ఉద్యోగాల నుంచి ఉద్వాసన పలకడం కూడా జరిగింది. భారంగా మారిన వారిని వదిలించుకునే పని మొదలైందని, ఇది తొలిదశ మాత్రమేనని సంస్థ నెమ్మదిగా గాడిలో పడితే సంతోషమేనని ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు.

మరో విషయం ఏంటంటే… సాక్షి టీవీ ఛానెల్‌లో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సంబంధించిన వార్తలను గతంలో ఆచితూచి ప్రచురించేవారు. తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఉందా? లేదా అని సరి చూసుకున్న తరువాతే ప్రసారం జరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా మారిపోయింది. వార్తకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు.

ఇటీవల చంద్రబాబు టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా సీట్ల ప్రకటన సందర్భాన్ని లైవ్‌ గా ప్రసారం చేయడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. జగన్‌ ప్రయోజనాలు కాపాడుతూనే ఛానెల్‌ను వాస్తవిక దృక్పథంలో నడిపేందుకు ప్రయత్నం జరుగుతోంది. మొత్తానికి వైఎస్ భారతి పూనికతో సాక్షిలో సంస్కరణల పర్వం మొదలైనట్టుగా కనిపిస్తోంది.