ఉన్నట్లుండి ఈ రోజు సోషల్ మీడియాలో ఓ వార్త. పవన్ తన భూమి ఒకటి అమ్మారని, మరో రెండు బేరం పెట్టారని. ఇదంతా పార్టీకోసం, ఎన్నికల కోసం చెేస్తున్నారని. నిజానికి ఈ క్లిపింగ్స్ వచ్చింది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కాదు. అసలు ఎవరికీపెద్దగా పరిచయం లేని, కొత్త లోగో లేదా పేరుతో వచ్చిన యూ ట్యూబ్ విడియో క్లిప్ లాంటిది. నిజానికి అది యూ ట్యూబ్ లో వుందో లేదో కూడా తెలియదు.
ఇహ..దాన్ని పట్టుకుని జనసేన పెయిడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఒకటే హడావుడి. అయ్యో జనం కోసం ఎంత త్యాగం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్లు. పవన్ కు సింపతీ తీసుకురావడానికి విపరీతమైన ప్రయత్నాలు.
ఇంతకీ ఇది నిజమా అని పవన్ కు కానీ పవన్ వ్యవహారాలు కానీ కాస్త పరిచయం వున్న, సమాచారం తెలిసే వర్గాలను సంప్రదిస్తే అసలు అలాంటిది ఏదీ లేదని సమాధానం. ఆ మాటకు వస్తే ఓ ఏడాది, రెండేళ్ల క్రితం పవన్ కొత్తగా ఆఫీసు కట్టుకున్నారు, కొంత భూమి కూడా కొన్నారని టాక్ వుంది.
ఇప్పుడు అమ్మడం అన్నది మాత్రం ఎక్కడా ఏ విధమైన సమాచారం అందడం లేదు. నిజానికి ఇలాంటిది వుంటే తెలుగుదేశం అనుకుల మీడియా ఊరుకుంటుందా? డాక్యుమెంట్ పట్టకుని మరీ ఊదరకొట్టేయదా? మరి కేవలం సోషల్ మీడియాలో, వాట్సాప్ ల్లో కనిపించిన ఈ క్లిప్ సంగతి ఏమిటి? అంటే తక్కువ సీట్లకు అంగీకరించి, పవన్ తనకు తానుగా చంద్రబాబుకు అమ్ముడు పోయారనే టాక్ విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. సహజంగా దీన్ని పట్టుకుని, పవన్ ఏదో సంపాదించేసుకుంటున్నారు అనే అనుమానాలు మొదలవుతాయి.
అందుకే వీటికి కౌంటర్ అన్నట్లుగా జనసేన సోషల్ మీడియా వేసిన ఎత్తుగడ అనుకోవాలేమో దీనిని. అంతకు మించి మరేం కాదు.