బాబు పల్లకీ మోయడానికి మోడీదళం రెడీనే!

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ విజయవాడలో పార్టీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలకు సిద్ధం కావడం గురించి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన చాలా విషయాలు…

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ విజయవాడలో పార్టీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలకు సిద్ధం కావడం గురించి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన చాలా విషయాలు చెప్పుకొచ్చారు.

అయితే అందులో కీలకమైన సంగతులు.. చంద్రబాబునాయుడు పల్లకీ మోయడానికి, ఆయనను మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికి బిజెపి సిద్ధంగా ఉన్నదనే సంకేతాలు ఇచ్చేలాగా ఉన్నాయి. అయితే దీనికి విరుద్ధంగా ఉన్న సంగతి ఏంటంటే.. ఇండైరక్టుగా చంద్రబాబు పల్లకీ మోస్తాం అని సంకేతాలిస్తూనే.. రాబోయే అయిదేళ్లలో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చేస్తుందని ప్రగల్భాలు పలకడం. 

రాజ్‌నాధ్ సింగ్ బిజెపి కోర్ కమిటీ సమావేశంలో పార్టీకి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీచుట్టూ రాజకీయ సందిగ్ధత నెలకొని ఉన్న నేపథ్యంలో ఆయన విజయవాడలో పార్టీ సమావేశంలో కీలకప్రసంగం చేయడం గమనించాల్సిన సంగతి.

జగన్మోహన్ రెడ్డిని ఓడించే లక్ష్యంతో ఒక్కటైన తెలుగుదేశం – జనసేన జట్టుతో బిజెపి కూడా కలుస్తుందా? లేదా? అనే సందిగ్ధత ఇప్పుడు పలువురిలో ఉంది. ఈ రెండు పార్టీలు మాత్రం.. బిజెపికి కేటాయించాల్సి వచ్చే అవకాశం గల కొన్ని సీట్లను ప్రకటించకుండా.. వారినుంచి సిగ్నల్ కోసం ఎదురుచూస్తూ గడుపుతున్నారు.

బిజెపి ఏఉద్దేశంతో ఉన్నదో గానీ.. ఇంకా తేల్చడం లేదు. సీట్ల విషయంలో బేరసారాల కారణంగానే ప్రకటన ఆలస్యం జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

అయితే రాజ్ నాధ్ సింగ్ తన మాటల్లో చంద్రబాబుకు అనుకూలంగానే తమ పార్టీ అడుగులు వేయబోతున్న సంగతిని తేల్చేశారు. అమరావతి మాత్రమే ఏపీకి ఏకైక రాజధానిగా ఉంటుందని, ఈ నిర్ణయానికి బిజెపి కట్టుబడి ఉంటుందని ఆయన తేల్చేశారు. తద్వారా.. మూడు రాజధానులు- అన్ని ప్రాంతాల సమానాభివృ‌ద్ధి అంటున్న జగన్ ఆలోచనలను ఆయన తిరస్కరిస్తున్నట్టే. 

అమరావతి రాజధాని అనే అంశాన్ని సమర్థించడం అంటే.. ఇండైరక్టుగా చంద్రబాబును, పవన్ ను  సమర్థించడమే అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి ఉంది. చంద్రబాబు పల్లకీ మోయడానికి బిజెపి సిద్ధంగా ఉండవచ్చు గానీ.. ఎన్నికలు మరో  45 రోజుల దూరంలో మాత్రమే ఉండగా.. ఇప్పటిదాకా పార్టీ పోటీ గురించి కూడా తేల్చలేని అశక్తతలో ఉన్న బిజెపి.. రాబోయే అయిదేళ్లలో ఏపీలో అధికారంలోకి వస్తుందని రాజ్ నాధ్ జోస్యం చెప్పడం విశేషం.

ప్రత్యేకహోదా విషయంలో ఏపీకి తమ పార్టీ చేసిన ద్రోహాన్ని రాబోయే అయిదేళ్లలోగా ప్రజలు మరచిపోతారని కేంద్రమంత్రి బలంగా నమ్ముతున్నట్టుగా ఉంది.