ఇలా టికెట్ వచ్చింది అలా షాక్ తగిలింది. ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరు టీడీపీ అభ్యర్ధి గుమ్మడి సంధ్యారాణి ఎస్టీ కాదంటూ ఆమె మీద ఫిర్యాదు అధికారులకు వెళ్లింది. ఆమె ఎస్టీ కొండ దొర సామాజిక వర్గం అని చెప్పుకుంటున్నారు కానీ ఆమె ఆ కులం కానే కాదని ఆదివాసి వికాస్ పరిషత్ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సాలూరులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
గుమ్మడి సంధ్యారాణి టీడీపీ సీనియర్ మహిళా నేత, ఆమె ఎమ్మెల్సీగా గతంలో పనిచేశారు. 2014లో అరకు నుంచి ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఇపుడు ఆమె సాలూరు నుంచి పోటీ చేసి ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొరను ఓడించాలని చూస్తున్నారు.
అయితే ఆమె ఎస్టీనే కాదని ఫిర్యాదు అందడంతో టీడీపీలో ఇపుడు కలవరం రేగుతోంది. ఆమె కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు అని ఆదివాసీ వికాస్ పరిషత్ సభ్యులు అంటున్నారు. ఆమె మీద గత టీడీపీ ప్రభుత్వం నుంచే ఫిర్యాదులు ఉన్నా తొక్కి పెట్టి ఉంచారని వారు ఆరోపిస్తున్నారు.
ఆమె సామాజిక వర్గం మీద తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గిరిజనులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈసారి అన్ని ఏర్పాట్లూ చేసుకుని విజయం కోసం అడుగులు వేస్తున్న సంధ్యారాణికి ఇది దెబ్బగా భావిస్తున్నారు.
గతంలో ఇలాగే ఎస్టీ కాదని ఈ జిల్లాకే చెందిన ఇక మాజీ మంత్రి మీద ఫిర్యాదు వెళ్ళింది. ఆ మీదట అదే నిజమని తేలింది. ఇపుడు సంధ్యారాణి విషయంలో ఉన్నతాధికారులు ఏ విధమైన విచారణ చేసి నిజం నిగ్గు తేలుస్తారో చూడాలి. టీడీపీలో అయితే టెన్షన్ బాగా పెరిగిపోతోంది.