తమ ఓటు కావాలంటే రాజకీయ పార్టీలు జనాభాలో తామున్న నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించాల్సిందే అని కాపులు ఏపీలోని రాజకీయ పార్టీలకు అల్టిమేటం జారీ చేశారు. కాపుల ఓట్లు కావాలంటే దానికి తగినట్లుగా సీట్లు ఇచ్చి తీరాల్సిందే అని వారు పష్టం చేశారు.
విశాఖలో జరిగిన కాపు ఉద్యమ జేఏసీ రౌండ్ టేబిల్ సమావేశంలో కాపులు పలు సంచలన తీర్మానాలు చేశారు. జేఏసీ 2015 నుంచి కాపుల సంక్షేమం కోసం పాటు పడుతోందని చెప్పారు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. కాపులందరికీ 20 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఏపీ జనాభాలో 28 శాతం ఉన్న కాపులకు అంతే నిష్పత్తిలో సీట్లు ఇవ్వాలని కాపు నేతలు కోరారు. కాపులను అన్ని విధాలుగా అండగా ఉండే పార్టీలకే తమ ఓట్లు అని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాపులకు జనాభా పద్ధతిలో సీట్లు ఇవ్వాలని, అలాగే నామినేటెడ్ పోస్టులలో కూడా వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
కాపులకు ఎవరు ఎక్కువ సీట్లు ఇస్తారో చూసి మరీ ఆయా పార్టీలకే ఓట్లు వేస్తామని విశాఖ కాపునాడు అధ్యక్షుడు తోట రాజీవ్ స్పష్టం చేశారు. కాపులకు సామాజిక న్యాయం జరగలేదని వారిని అన్ని విధాలుగా ఓట్ల కోసం వాడుకోవడం తప్పించి ఎక్కడా వారిని గౌరవించడం లేదని కాపు నేతలు విచారం విచారం వ్యక్తం చేశారు.
కాపులకు ఎక్కువ సీట్లు ఇచ్చిన పార్టీలకే ఓటు అంటే కాపు జేఏసీ ఏ పార్టీకి మద్దతు ఇస్తుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెట్టారని అంటున్నారు. దీని మీద ఎన్నికల ముందు కాపు జేఏసీ తీర్మానం చేస్తుందని అంటున్నారు.