హిట్-2 సినిమాలో మ్యాక్స్ గుర్తుందా..? హీరో అడివి శేష్ ఎక్కడుంటే అక్కడుంటుంది ఆ కుక్క. ఆ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కూడా అదే. ఇప్పుడా కుక్క లేదు. మ్యాక్స్ చనిపోయింది. ఈ విషయాన్ని అడివి శేష్ ప్రకటించాడు.
మ్యాక్స్ అసలు పేరు సాషా. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది ఇది. వెంటనే వెట్ హాస్పిటల్ కు తరలించారట. హాస్పిటల్ లో సాషాను చూసినప్పుడు బాగానే ఉందంట. కోలుకుంటుందని కూడా భావించారట. కానీ సాషా ఓడిపోయింది.
హిట్-2 సినిమాలో హీరోను గెలిపించిన ఈ బెల్జియం జాతి శునకం, నిజజీవితంలో ఓడిపోయింది. మ్యాక్స్ లేదన్న విషయం తెలిసి హీరో అడివి శేష్ చలించిపోయాయి. సినిమా షూటింగ్ లో మ్యాక్స్ తో అద్భుతమైన రోజులు గడిపానని, తనతో పాటు యూనిట్ అందరికీ సంతోషాన్ని అందించిన మ్యాక్స్ లేదనే విషయాన్ని భరించలేకపోతున్నానని, ఈ విషయం టైపు చేస్తున్నప్పుడు కూడా తనకు కన్నీళ్లు ఆగడం లేదని పోస్టు పెట్టాడు అడివి శేష్.
హిట్-2 క్లయిమాక్స్ లో కీలక పాత్ర పోషించింది మ్యాక్స్. ఒక దశలో హీరోను కాపాడి తను ప్రాణత్యాగం చేస్తుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సక్సెస్ సాధించింది.