బాంబు పేల్చిన చేగొండి.. ప‌వ‌న్‌కు డెడ్‌లైన్‌!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాలిట జోరీగ‌, కాపు సంక్షేమ సేనాని చేగొండి హ‌రిరామ జోగ‌య్య మ‌రో లేఖాస్త్రాన్ని సంధించారు. టీడీపీతో పొత్తులో భాగంగా త‌క్కువ సీట్ల‌కే ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంగీక‌రించ‌డంపై కాపులు ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. క‌మ్మ వారికి…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాలిట జోరీగ‌, కాపు సంక్షేమ సేనాని చేగొండి హ‌రిరామ జోగ‌య్య మ‌రో లేఖాస్త్రాన్ని సంధించారు. టీడీపీతో పొత్తులో భాగంగా త‌క్కువ సీట్ల‌కే ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంగీక‌రించ‌డంపై కాపులు ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. క‌మ్మ వారికి త‌మ ఆత్మ గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్ట‌డంలో ప్ర‌ధాన కుట్ర‌దారుడు నాదెండ్ల మ‌నోహ‌రే అనే అక్క‌సుతో ఆయ‌న‌పై గ‌త రాత్రి జ‌న‌సేన శ్రేణులు దాడికి తెగ‌బ‌డ్డ సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో త‌మ ఆత్మ గౌర‌వాన్ని, ఐక్య‌త‌ను తామే కాపాడుకోవాల‌నే ఆలోచ‌న ముఖ్యంగా కాపుల్లో క‌లిగింది. ప‌వ‌న్‌తో తాడోపేడో తేల్చుకునే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని తాజాగా కాపు సేనాని చేగొండి హ‌రిరామ జోగ‌య్య లేఖ ద్వారా వెల్ల‌డైంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ప‌వ‌న్‌కు చేగొండి సున్నితంగానే డెడ్‌లైన్ విధించ‌డాన్ని ఈ లేఖ‌లో చూడొచ్చు. ఒక‌వైపు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తూనే, మ‌రోవైపు కొన్ని ప్ర‌శ్న‌ల‌కు తాడేప‌ల్లిగూడెం స‌భ స‌మాధానం ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

తాజా లేఖ‌లో బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల భ‌విష్య‌త్‌తో జ‌న‌సేన‌ను ముడిపెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా వుంది. చాలా వ్యూహాత్మ‌కంగా చేగొండి ప‌వ‌న్‌కు ప‌రీక్ష పెట్టార‌ని చెప్పొచ్చు. పొత్తులో భాగంగా బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు రాజ్యాధికారం అనే అంశం పక్క‌దారి ప‌డుతున్న‌ట్టుంద‌ని తాను చెప్ప‌ద‌లుచుకున్న‌ది కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చేగొండి చెప్పారు. ముఖ్యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అధికారంలో భాగ‌స్వామ్యంపై స్ప‌ష్ట‌త కోసం ఎన్నిక‌ల‌య్యే వ‌ర‌కూ ఆగ‌లేన‌ని ఆయ‌న తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం. రేప‌టి తాడేప‌ల్లిగూడెం ఉమ్మ‌డి స‌భ‌లో స్ప‌ష్ట‌త రావాల్సిందే అని ఆయ‌న బ‌హిరంగంగా డిమాండ్ చేయ‌డం విశేషం. తాజా లేఖ‌లో హ‌రిరామ జోగ‌య్య ఏమ‌న్నారంటే…

“బడుగు, బలహీనవర్గాలు ఆశిస్తున్న ప్రకారం అధికారం పంచుకోవడంలో పవన్ కల్యాణ్  పాత్ర ఏమిటో, చంద్రబాబు పాత్ర ఏమిటో తెలియకుండా ముందుకెళ్ల‌డానికి వీల్లేదు. అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలి. గౌరవమైన హోదాలో పవన్ క‌ల్యాణ్ పదవి దక్కించుకోవాలి. ఆ హోదాతో కూడిన పదవితో, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి, సమాజంలో వారి గౌరవానికి తగ్గ నిర్ణయాలు తీసుకోగల్గిన సర్వాధికారాలు పవన్‌కు దక్కాలి. ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం కూటమిలో ముఖ్య భాగస్వామ్యులైన తెలుగుదేశం అధినేతల ద్వారా తాడేపల్లిగూడెంలో హాజరయ్యే ప్రజానీకం పొందగలగాలి”

“ఈ రకమైన సమాధానం కోసం బడుగు, బలహీనవర్గాల క్షేమం కోరే ప్రతినిధులలో ఒకనిగా ఎదురు చూడదల్చుకున్నాను. లేనిచో వ్యక్తిగతంగానే నేను ఎలాంటి చ‌ర్య‌ తీసుకోదలచుకున్నానో 29వ తేదీ ప్రకటించి, ముందుకెళ్లాల‌నుకుంటున్న‌ట్టు ప్రజానీకానికి తెలియ‌జేస్తున్నా” అని డెడ్‌లైన్ విధిస్తూనే, అంద‌రి ఆశీస్సులు కోర‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

దాదాపు 86 ఏళ్ల వ‌య‌సులో కాపులకు రాజ్యాధికారం కోసం చేగొండి ప‌డుతున్న చూస్తే, ఆ సామాజిక వ‌ర్గం వారికే కాకుండా ఇత‌రుల్లో కూడా స్ఫూర్తి క‌లుగుతోంది. కానీ కాపులు ఎవ‌రినైతే న‌మ్మారో, ఆ నాయ‌కుడే వారిని నిలువునా ముంచ‌డం తీవ్ర ఆవేద‌న క‌లిగిస్తోంది. దీంతో జీవిత చ‌ర‌మాంకంలో ఏదో సాధించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో చేగొండి భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని హెచ్చ‌రించే ప‌రిస్థితి ఉత్ప‌న్న‌మైంది.