టాలీవుడ్ అగ్ర హీరో పవన్‌కల్యాణ్ జనసేన పేరుతో రాజకీయ పార్టీ స్థాపించి పదేళ్లు అయ్యింది. రాజకీయాల్లో పదేళ్ల కాలం అంటే చాలా విలువైంది. పదేళ్ల కాలంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అంచెలంచెలుగా ఎదిగారు. కానీ ఈ పదేళ్లలో పవన్‌కల్యాణ్ రాజకీయంగా ఎదగకపోగా, మరింత పతనం కావడం గమనార్హం.
దీనికి మరెవరినో నిందించాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప, హత్యలుండవంటారు. ఇందుకు పవన్‌కల్యాణ్ రాజకీయ రాజకీయ తిరోగమనమే నిలువెత్తు నిదర్శనం. పవన్‌కల్యాణ్ పైకి ఎన్ని ఆదర్శాలు మాట్లాడినా, జనానికి అర్థమైంది ఏంటంటే… జగన్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకోడానికి మాత్రమే జనసేన ఆవిర్భవించిందని. దీన్ని సమాజం స్వాగతించదు. ఎందుకంటే ప్రజానీకం ఆలోచనలు పవన్‌లా సంకోచితంగా లేవు.
రాజకీయాల్లో ఎవరేం చేస్తున్నారో ప్రజలు జాగ్రత్తగా గమనిస్తుంటారు. పదేళ్లలో పవన్‌కల్యాణ్ టీడీపీ-బీజేపీ కూటమి పల్లకీ మోశారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడానికి 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేసి, తద్వారా జగన్ సీఎం కాకుండా అడ్డుకోడానికి సర్వశక్తులు ఒడ్డారు. ప్రజలు మాత్రం పవన్‌కు గట్టి గుణపాఠమే చెప్పారు. 2024 ఎన్నికలకు వచ్చే సరికి ఒంటరిగా పోటీ చేస్తే కనీసం తాను కూడా గెలవలేనని పవన్ ఒక నిర్ణయానికి వచ్చారు. దీన్ని బట్టి పవన్‌కల్యాణ్ పదేళ్లలో సాధించేందేంటో అంచనా వేసుకోవచ్చు.
తమ కోసం పవన్‌కల్యాణ్ నిలబడి వుంటే… ఆదరించనంత చెడ్డ మనస్తత్వం ప్రజానీకానికి లేదు. కనీసం తనను కూడా గెలిపించలేదని పదేపదే ప్రజలపై పవన్ నిందలు వేస్తుంటారు. అదే నిజమైతే చంద్రబాబు, వైఎస్ జగన్‌లపై మాత్రం ప్రజలకు ప్రత్యేక ప్రేమ ఎందుకుంటుంది? పైగా చంద్రబాబు, వైఎస్ జగన్ సామాజిక వర్గాల బలం నాలుగు, ఆరు శాతం మాత్రం. కానీ పవన్ సామాజిక వర్గం బలం 15 శాతం. మరెందుకని పవన్ ప్రజాదరణ పొందులేకపోతున్నారనే ప్రశ్నకు సమాధానం… అన్ని వర్గాల ప్రజల నమ్మకాన్ని చూరగొనకపోవడమే.
పదేళ్లలో పవన్ సక్సెస్ అయ్యింది ఎక్కడంటే… తన సామాజిక వర్గాన్ని మోసగించడంలో. బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ అధ్యక్షుడు తనను నమ్మి నెత్తిన పెట్టుకున్న సొంత సామాజిక వర్గాన్ని ఇంతగా వంచించిన దాఖలాలు లేవని మేధావులు, రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. రాజ్యాధికారం కోసం కాపులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి జనసేన పార్టీ ఒక ఆశా కిరణంలా కనిపిస్తోంది.
పవన్‌ను సీఎంగా చూడాలని కాపులు, అనుబంధ కులాల చిరకాల ఆకాంక్ష. పవన్‌కు సినీ పరంగా గ్లామర్‌ను దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సీఎం పదవిని సాధించుకోలేమని ఆ సామాజిక వర్గం అభిప్రాయం. ఇది నిజం కూడా. తన సామాజిక కోరికనే పెట్టుబడిగా పవన్ మలుచుకున్నారు. 2014లో ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ కూటమికి బేషరతుగా మద్దతు ఇవ్వడానికి ఏదో లాజిక్ చెప్పారు. ఆ తర్వాత 2019లో మళ్లీ ఏదో చెప్పి బరిలో నిలిచారు. పవన్ ఏం చెప్పినా ఆయన వెంట మెజార్టీ కాపులు నడిచారు.
చివరికి 2024లోనూ టీడీపీకి జనసేనను తాకట్టు పెట్టడానికి రాష్ట్ర, తెలుగుదేశం ప్రయోజనాలంటూ కొత్త కథలు పవన్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ను అభిమానించే ఆయన సామాజిక వర్గంలో అంతర్మథనం మొదలైంది. గత పదేళ్లుగా పవన్‌ను నమ్మడం వల్లే మోసపోయామనే కనువిప్పు కలుగుతోంది. పదేళ్లుగా పవన్ చేతిలో అన్‌స్టాపబుల్‌గా వంచనకు గురయ్యామనే భావనను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ తనను గుడ్డిగా నమ్మిన సామాజిక వర్గంలోని ప్రజానీకాన్ని మోసగించడంలో పవన్ విజయవంతమయ్యారు.
టీడీపీతో పొత్తు వద్దని, బాబును నమ్మితే మునిగిపోతామని ఎవరైనా అంటే… వ్యూహాన్ని తనకు వదిలేయాలనే ఒకే ఒక్క మాటతో అందరి నోళ్లను మూయించడానికి అస్త్రంగా వాడుతున్నారు. కొందరు మొండిగా పొత్తును వ్యతిరేకిస్తే… మీరంతా జగన్ కోవర్టులని పక్కన పెట్టాల్సి వస్తుందని బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం చూశాం. కాపులను మోసగించిన, మోసగిస్తున్న ఒకే ఒక్కడిగా పవన్‌కల్యాణ్ మిగిలారనే అభిప్రాయం బలపడుతోంది.