ఎన్నికలు ముందుకొస్తున్న తరుణంలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఇంత కాలం వైసీపీ మాత్రమే అభ్యర్థులను విడతల వారీగా ప్రకటించింది. దీంతో టీడీపీ, జనసేన అధినేతలపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు 94 సీట్లలో అభ్యర్థులను ప్రకటించి టీడీపీ శ్రేణుల ప్రేమను చూరగొన్నారు. జనసేన నేత ఐదుగురు అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటించారు.
ఇదిలా వుండగా తిరుపతి జిల్లా చంద్రగిరి అభ్యర్థిపై తీవ్ర ఉత్కంఠ నెలకుంది. ప్రస్తుతం అక్కడ టీడీపీ ఇన్చార్జ్ పులివర్తి నాని , ఆయన కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే చంద్రగిరిలో సిటింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు నాని వర్తీ కాదని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో అభ్యర్థి మార్పునకు ఆయన కసరత్తు చేస్తున్నారని తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రముఖ రియల్టర్ డాలర్స్ దివాకర్‌రెడ్డిని చంద్రగిరి బరిలో నిలపాలని చంద్రబాబు వ్మూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. డాలర్స్‌ను పోటీ చేయించడం ద్వారా రెడ్ల ఓట్లలో చీలిక, అలాగే ఇతర సామాజిక వర్గాఆల ఓట్లు కలిసొస్తాయని చంద్రబాబు అంచనా వేశారు. చెవిరెడ్డి కుటుంబాన్ని ఢీకొట్టే స్థాయిలో పులివర్తి నాని వద్ద ఆర్థిక వనరులు లేవని బాబు అంటున్నారని తెలిసింది.
పార్టీనే ఎన్నికల ఖర్చంతా పెట్టుకునే పరిస్థితి లేదని చంద్రబాబు స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తనకు టికెట్ ఇస్తే చెవిరెడ్డి తనయుడిని ఓడించేందుకు ఎందాకైనా వెళ్తా, ఎంతైనా ఖర్చు పెడతా అని దివాకర్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. గల్లా కుటుంబం ఆశీస్సులు కూడా దివాకర్‌రెడ్డికే ఉండడంతో.. మార్పు అంటూ దివాకర్‌రెడ్డి పేరుతో వాల్‌పోస్టర్లు తిరుపతి జిల్లాలో పెద్ద ఎత్తున ప్రత్యక్షమయ్యాయి.
చంద్రగిరి టికెట్ పులివర్తి నానికి ప్రకటించని నేపథ్యంలో, డాలర్స్ దివాకర్‌కు దాదాపు ఖాయమైనట్టు తిరుపతి జిల్లాలో ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి కావడంతో, దానిపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఈ దఫా ఎలాగైనా చెవిరెడ్డి కుటుంబాన్ని ఓడించాలనే పట్టుదలతో చంద్రబాబు కూడా ఉన్నారు. అందుకే దగ్గరివాడైన పులివర్తిని సైతం పక్కన పెట్టి, గెలుపు గుర్రం కోసం వెతుకుతున్నారని పలువురు అంటున్నారు.