అనకాపల్లి ఎమ్మెల్యే సీటుని ఏరి కోరి జనసేన తీసుకుంది. పార్టీలో హఠాత్తుగా చేరిన మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణకు ఇచ్చేసింది. దీంతో ఇపుడు అనకాపల్లి రాజకీయం రగులుతోంది. రాజకీయంగా చైతన్యవంతమైన నియోజకవర్గం ఇది. కొణతాల ఇప్పటిదాకా రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఒకసారి మాత్రమే గెలిచిన చరిత్ర ఉంది.
ఆయన 2004లో వైఎస్సార్ వేవ్ లో అనకాపల్లి నుంచి తొలిసారి గెలిచారు మంత్రి కూడా అయ్యారు. అదే కొణతాల వైఎస్సార్ రెండవసారి టికెట్ ఇచ్చినా అనకాపల్లి నుంచి 2009లో ఓటమి చూసారు. 2014, 2019లలో ఆయన అసలు పోటీ చేయలేదు. ఒక విధంగా పదిహేనేళ్ళుగా ఆయన క్రియాశీల రాజకీయాలకు కొంచెం దూరంగానే ఉన్నారు అని అంటున్నారు.
అనకాపల్లిలో కొణతాల హవా అన్నది గత వైభవంగా మారింది. 2019 తరువాత ఆయన అయిదేళ్ల పాటు రాజకీయ అజ్ఞాతమే చేశారు. సడెన్ గా ఆయన జనసేనలో చేరడం అనూహ్యంగా అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ దక్కడం చకచకా జరిగిపోయాయి. ఇపుడు టికెట్ దక్కింది కానీ గెలుపు కోసం కొణతాల కష్టపడాల్సిందే అని అంటున్నారు.
జనసేనకు టీడీపీ మనస్పూర్తిగా సహకరించాలి. అలాగే జనసేనలో ఉన్నవారు కూడా మద్దతు ఇవ్వాలి. అయితే తనకు అందరూ సహకరిస్తారు అని కొణతాల చెబుతున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణను కలిశానని జనసేన అనకాపల్లి ఇంచార్జి పరుచూరి భాస్కరరావు కూడా తనకు సపోర్ట్ ఇస్తామని చెప్పారని కొణతాల అంటున్నారు.
అంతా బాగానే ఉన్నా లోలోపలే డౌట్లు కొడుతున్నాయని అంటున్నారు. పీలా వర్గం అయితే ఆయనకే టికెట్ కావాలని అంటోంది. పీలా అయితే టికెట్ దక్కలేదని మండిపోతున్నారు. టీడీపీ నేతలు అంతా అసలు అనకాపల్లి వంటి ప్రతిష్టాత్మకమైన సీటు ఎందుకు వదులుకున్నారని టీడీపీ పెద్దల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అయితే ఈ పరిణామాల మీద ఏమీ మాట్లాడటం లేదు. ఆయన కుమారుడు దాడి రత్నాకర్ రేసులో ఉన్నారు. యువతకు టికెట్ అంటే అతనికి ఇస్తారని ఆశించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు వంటి వారు మరోసారి తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిణామాలు అన్నీ చూసిన మీదట కొణతాలకు ఇది టఫ్ జాబ్ అని అంటున్నారు. వైసీపీ ఇదే అదనుగా రాజకీయంగా పావులు కదిపితే మాత్రం అనుకూల పరిణామాలు దక్కుతాయని అంటున్నారు.