పార్టీలో దశాబ్దాల కాలం నుంచి పనిచేస్తూ వస్తున్న సీనియర్లకు మొదటి లిస్ట్ లో మొండి చేయి చూపించారు చంద్రబాబు. దాంతో సీనియర్లు రగిలిపోతున్నారు. తాము పార్టీని అట్టిపెట్టుకుని ఇన్నేళ్ల కాలం పాటు పని చేసినందుకు ఫలితం ఇదేనా అని అంటున్నారు. సీటు విషయం తరువాత తమకు ఇది అవమానంగా ఉంది అని అంటున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే మాజీ మంత్రి ఎన్టీయార్ కాలం నుంచి ఉన్న కిమిడి కళా వెంకటరావుకు మొదటి లిస్ట్ లో చోటు లేకుండా పోయింది. ఆయన విభజన ఏపీకి తొలి టీడీపీ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. అనేక సార్లు ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఇంతటి సీనియర్ కి ఫస్ట్ లిస్ట్ షాక్ తగిలింది అని అనుచరులలో ఆవేదన కనిపిస్తోంది.
ఇదే జిల్లాలో మరో సీనియర్ నేత గుండ అప్పల సూర్యనారాయణ సతీమణి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి శ్రీకాకుళం సీటుని పెండింగులో పెట్టారు. ఆమె పేరు కూడా తొలి జాబితాలో లేదు. దాంతో గుండ అనుచరులు కూడా కలవరపడుతున్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా విధేయత చూపించినా సీటు విషయంలో గ్యారంటీ ఎందుకు లేదు అని మధనపడుతున్నారు.
విజయనగరం జిల్లాలో చూసుకుంటే ఎస్ కోట లో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పేరు ఫస్ట్ లిస్ట్ లో లేకపోవడంతో ఆమె అనుచరులలో ఆందోళన చెలరేగుతోంది. పార్టీకి అంకితం అయి పనిచేస్తున్నా తమ పేరు లేదంటే వేరే ఆలోచనలు చేస్తున్నారా అన్న ఆలోచనల్లో ఆమె వర్గీయులు ఉన్నారు.
చీపురుపల్లిలో ప్రచారం చేస్తూ గత అయిదేళ్ళుగా ఇంచార్జి బాధ్యతలు చూస్తున్న కిమిడి నాగార్జున పేరు ఫస్ట్ లిస్ట్ లో లేదు. ఇక్కడ సీటు ఆయనకు లేకుండా పోతోందా అందోళనగా ఉంది. విశాఖ జిల్లాలో ఇద్దరు సీనియర్ మాజీ మంత్రులకు తొలి విడతలో చోటు లేకపోవడంతో అనుచరులు సీరియస్ గానే తీసుకుంటున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు ఎపుడూ ఉంటూ వచ్చేది ఈసారి మాత్రం ఆయనకు విశాఖ జిల్లా నుంచే నో చెబుతున్నారా అన్నదే ఆయన వర్గంలో కలుగుతున్న సందేహం.
పెందుర్తి నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి సీటు లేదా అన్న డౌట్ ఆయన వర్గంలో వెంటాడుతోంది. ఆయనకు తొలి జాబితాలో పేరు లేకుండా టిక్కు పెట్టారంటే మ్యాటర్ సీరియస్ అని అంటున్నారు. అలాగే సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరు కూడా తొలి జాబితాలో మిస్ అయిందంటే ఆయనకు గాజువాక చేజారినట్లేనా అన్న సందేహం వ్యక్తం అవుతోంది.