జనసేనాని పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చినంత మాత్రాన టికెట్ దక్కుతుందనే భరోసా లేదని తేలిపోయింది. స్వయంగా పవన్ హామీ ఇచ్చినా … టికెట్లు దక్కకపోవడంతో జనసేనలో తీవ్ర నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. టికెట్ ఇచ్చేది, తీసుకునేదెవరని జనసేన నేతలు వైరాగ్యంతో మాట్లాడుకుంటున్నారు.
జనసేన రిమోట్ చంద్రబాబునాయుడి చేతిలో వుందని, పక్కా ఆధారాలతో ఆ పార్టీ నేతలు ఆవేదనతో వివరిస్తుండడం చర్చనీయాంశమైంది. నిన్న తణుకు జనసేన ఇన్చార్జ్ విడివాడ రామచంద్రరావు, నేడు రాజమండ్రి రూరల్ ఇన్చార్జ్ కందుల దుర్గేష్, రేపు పవన్ చేతిలో రాజకీయంగా బలి అయ్యేదెవరో అనే చర్చ జనసేనలో విస్తృతంగా జరుగుతోంది. పవన్ వైఖరిపై జనసేన శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
పవన్‌కల్యాణ్ గతంలో జనసేన మొట్టమొదటి అసెంబ్లీ అభ్యర్థిగా తణుకు ఇన్చార్జ్ విడివాడ రామచంద్రరావును ప్రకటించారు. ఆ సందర్భంలో పవన్ తీవ్ర భావోద్వేగంతో ప్రసంగించారు. గతంలో రామచంద్రరావుకు టికెట్ ఇవ్వనందుకు వేలాది మంది సమక్షంలో క్షమాపణ చెబుతున్నట్టు తెలిపారు. అప్పట్లో సీటు ఇచ్చిన వ్యక్తి, నేడు పార్టీలో లేరని గుర్తు చేశారు. టికెట్ ఇవ్వకపోయినా ఓపిగ్గా వెంట నడుస్తున్న విడివాడ రామచంద్రరావును అసెంబ్లీకి పంపిస్తానని వేలాది మంది సాక్షిగా పవన్ మాట ఇచ్చారు.
టీడీపీతో పొత్తు కుదుర్చకున్న నేపథ్యంలో తణుకు టికెట్‌పై ఉత్కంఠ కలిగించింది. అయితే ఈ సీటును టీడీపీ ఎగేసుకుపోయింది. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ పోటీ చేస్తాడని చంద్రబాబు ప్రకటించడంతో జనసేన శ్రేణులు ఒక్కసారిగా తీవ్ర నిరాశకు లోనయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఇలాంటిదే మరో ఘటన.
రాజమండ్రి రూరల్ జనసేన ఇన్చార్జ్ కందుల దుర్గేష్‌కు ఇటీవల పవన్‌కల్యాణ్ టికెట్‌పై భరోసా ఇచ్చారు. రాజమండ్రి రూరల్ టికెట్ మీకేనని, క్షేత్రస్థాయిలో ముందుకెళ్లాలని ప్రోత్సహించారు. దీంతో కందుల దుర్గేష్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే రాజమండ్రి రూరల్ సిటింగ్ సీటు కావడంతో తామే తీసుకుంటున్నామని పవన్‌కు చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో నిడదవోలుకు వెళ్లాలని కందుల దుర్గేష్‌కు పవన్‌కల్యాణ్ చావు కబురు చల్లగా చెప్పారు. పవన్ సూచనతో కందుల దుర్గేష్ షాక్‌కు గురయ్యారు. మూడు రోజుల ముందు ఇచ్చిన హామీకి కూడా కట్టుబడి లేకపోవడం ఏంటని పార్టీ శ్రేణుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాజమండ్రి రూరల్‌లో నాలుగేళ్లుగా బాగా చేసుకున్నానని, గెలుస్తాననే నమ్మకం ఉన్న సీటు వదిలేసి, సంబంధంలేని నిడదవోలుకు వెళ్లి ఏం చేయాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. తమ నాయకుడికి రాజమండ్రి రూరల్ సీటు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కందుల దుర్గేష్ అనుచరులు జనసేన ప్లెక్సీలను చించిపడేశారు. ఇలాగైతే పార్టీ ఎలా గెలుస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అడిగారని ప్రతిదానికి తలూపుతూ పోతే, రేపు ఇంకెవరిని బలి చేస్తారని జనసైనికులు ప్రశ్నిస్తుండడం గమనార్హం.
పవన్ చేతిలో ఏమీ లేదని, అంతా చంద్రబాబు ఇష్టానుసారమే జనసేనలో కూడా సీట్లు ఇచ్చే పరిస్థితి వుందని జనసైనికులు మండిపడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చూస్తుంటే… చంద్రబాబు చేతిలో జనసేన రిమోట్ ఉందనే అభిప్రాయం బలపడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.