Advertisement

Advertisement


Home > Politics - Opinion

నలభయ్యేళ్ల అనుభవశీలి చంద్రబాబులో మరీ ఇంత భయమా?

నలభయ్యేళ్ల అనుభవశీలి చంద్రబాబులో మరీ ఇంత భయమా?

భారతదేశ రాజకీయాల్లో తనతో సమానమైన సీనియారిటీ ఉన్న నాయకుడు లేనే లేడని చంద్రబాబునాయుడు సొంత డప్పు కొట్టుకుంటూ ఉంటారు. ఆయనతో సమానమైన వ్యూహరచనా ధురీణుడు ప్రపంచంలోనే లేరని ఆయన భజంత్రీలు భజన చేస్తుంటారు. అలాంటి నాయకుడు ఇంతటి దయనీయమైన జాలిగొలిపే స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారేమిటి? 

బిజెపితో పొత్తుల కోసం దేవులాట.. వాళ్లు ఏ సంగతి తేల్చేవరకు సీట్లను పంచుకోలేని దుస్థితి.. నాలుగు దశాబ్దాల అనుభవం అంటూనే.. జీరో అనుభవం ఉన్న పవన్ ఎలా ఆడిస్తే అలా ఆడడానికి ఎగబడడం.. మంచి చెడులతో నిమిత్తం లేకుండా ఎవరు తమ పార్టీలోకి వస్తామన్నా రెడ్ కార్పెట్ వేసి స్వాగతించడం.. ఇవన్నీ దేనికి సంకేతాలు!

చంద్రబాబునాయుడు భయపడుతున్నారు! ఎన్నికలు వస్తోంటే.. గెలుస్తామో ఓడుతామో అని ప్రతి ఒక్కరూ భయపడడం సహజమే కావొచ్చు. కానీ.. కించిత్ వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం కూడా లేకుండా చంద్రబాబులో మరీ ఇంత బేలతనమా? ఆయన ప్రవర్తన అందిస్తున్న సంకేతాల మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘నలభయ్యేళ్ల అనుభవశీలి చంద్రబాబులో మరీ ఇంత భయమా?’!

ఇతర పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవడం అనే ఒక్క అంశాన్ని రాజకీయాల్లో బలహీనతకు చిహ్నంగా పరిగణించాల్సిన అవసరం లేదు. అది ఒక వ్యూహంగా బలమైన పార్టీలు కూడా పొత్తులు కుదుర్చుకుంటూనే ఉంటాయి. ప్రత్యర్థిని కట్టడి చేయడానికి, ప్రత్యర్థి బలోపేతం కాకుండా చూడడానికి ఇదొక వ్యూహంగా అనుసరిస్తూ ఉంటాయి. అయితే ఆ పొత్తులు కుదుర్చుకునే తీరులో మాత్రం బలాలు- బలహీనతలు ఖచ్చితంగా బయటపడతాయి.

ఇతర పార్టీల పొత్తు కోసం వెంపర్లాడుతున్నాయా? లేదా, వారితో స్నేహబంధం కోసం ఖచ్చితంగా వ్యవహరిస్తున్నాయా అనే విషయం గమనిస్తే వారి తీరు తెలిసిపోతుంది. ఈ కోణంలోంచి చూసినప్పుడు ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబునాయుడు పొత్తుల కోసం ఆరాటపడుతున్న తీరును గమనిస్తే.. జాలి కలుగుతుంది. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, నలభయ్యేళ్లకు పైగా సీనియారిటీ ఉందని చెప్పుకునే రాజకీయ దురంధరుడు ఈయనేనా అనే అనుమానం కలుగుతోంది. ఇంత దీనంగా పొత్తుల కోసం ఆరాటపడుతున్న వారు దేశంలో మరెవ్వరూ మనకు కనిపించరు.

వర్తమాన భారతంలో పొత్తు రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో.. ఇక్కడ కొంచెం పోల్చి చూసుకోవాలి. కేంద్రంలో నరేంద్రమోడీ సర్కారును పతనం చేయడానికి ఎన్డీయేతర పార్టీలన్నీ ఒక్కతాటిమీదకు వచ్చే ప్రయత్నం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో అనేక ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కూడా ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. ప్రాంతీయ పార్టీలన్నీ తమ తమ రాష్ట్రాల్లో కాంగ్రెసుతో సీట్ల పంపకం చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. అయితే.. వారిలో ఏ ఒక్కరూ కూడా కాంగ్రెసు ముందు సాగిలపడడం లేదు. చాలా స్పష్టతతో, ధైర్యంగా వ్యవహరిస్తున్నారు.

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. అసలు కాంగ్రెసుకు రెండు సీట్లు మించి ఇవ్వను పొమ్మన్నారు. అంతకంటె ఎక్కువ కోరుకుంటే.. అసలు పొత్తులే లేవు. మా రాష్ట్రంలో మేం మొత్తం అన్ని స్థానాలకు పోటీచేస్తాం అంటూ కుండబద్దలు కొట్టేశారు. ఎన్నికల తర్వాత.. ప్రభుత్వం ఏర్పడడానికి ఇండియా గురించి ఆలోచిస్తామని.. ఎన్నికల ముందు కాదని తేల్చి చెప్పేశారు.

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏమీ తక్కువ తినలేదు. కాంగ్రెసు మెట్టు దిగకుంటే.. ఒంటరిగానే పోటీచేస్తామని తేల్చిచెప్పి, పొత్తులు తేల్చడానికి గడువును నిర్ణయించి.. కాంగ్రెసుకు హెచ్చరిక జారీచేశారు. ఆమేరకు తాము డిసైడ్ చేసిన విధంగా సీట్లు పంచుకున్నారు. పిన్న వయస్కుడైన యూపీ సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెసుతో పొత్తుల విషయంలో ఏమాత్రం జంకలేదు. రాజీ పడలేదు. మేం చెప్పినట్లుగా పొత్తుల్లోకి వస్తే రండి.. రాకపోతే పొండి.. అనే ధోరణిలోనే వారందరూ కూడా వ్యహరించారు. అవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలే! కానీ అంత ధీమాగా, నిర్భయంగా పొత్తు బంధాల్లో దృఢంగా వ్యవహరిస్తున్నాయి.. ఎందుకని?

వారికి ఆత్మవిశ్వాసం ఉంది. తమ పార్టీ మీద తమకు నమ్మకం ఉంది. గెలుపో ఓటమో తరవాత.. తమ బలం మీద తమకు ఒక నమ్మకం ఉంది. మరొక పార్టీ వచ్చి జతకలిసినా కలవకపోయినా తాము అడుగు ముందుకు వేయగలం అనే ధైర్యం ఉంది. మన నాలుగుదశాబ్దాల సీనియారిటీ ఉన్న నాయకుడికి కించిత్తు అయినా లేనివి ఈ లక్షణాలే! వీటిలో ఒక్కటి కూడా చంద్రబాబులో కనిపించడంలేదు. చంద్రబాబు భీరువు. ఆయనలోని పిరికితనం ప్రస్తుతం పుష్కలంగా బయటపడుతోంది. చంద్రబాబునాయుడు తనలోని పిరికితనం కారణంగా మోడీని కూడా తమ పొత్తుల బంధంలోకి లాక్కురావాలని అనుకున్నారు. అందుకోసం ఆయన ఎదుట సాగిలపడ్డారు సరే.. అటువైపు నుంచి తుదినిర్ణయం వచ్చేదాకా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా, వేయలేకుండా.. తనను తాను కట్టడి చేసేసుకుంటున్నారు ఎందుకు? తద్వారా తనలోని పిరికితనాన్ని, భయాన్ని, బేలతనాన్ని ఇంత బాహాటంగా బయటపెట్టుకుంటున్నారు ఎందుకు?

వ్యూహం కాదు అది భయం!

చంద్రబాబునాయుడు అత్యద్భుతమైన, అసమానమైన రాజకీయ వ్యూహరచనా దురంధరుడు అని, ముందే చెప్పుకున్నట్టు, ఆయన భజంత్రీలు కీర్తిస్తూ ఉంటారు. అలాంటి స్తోత్రాలకు అవకాశం ఇచ్చేలాగా.. చంద్రబాబు కూడా తనను మించిన వాడు లేడని డప్పుకొట్టుకుంటూ ఉంటారు. ఆయన అసలు వ్యూహం ఒకటుంది. ప్రతి ఎన్నికలకు ఎవరికి కాస్త ప్రజాదరణ మెరుగ్గా ఉన్నదో.. వారిని మభ్యపెట్టి తన జట్టులో కలుపుకోవడం. వారి గ్రాఫ్ మీద సందేహం రాగానే వదిలించుకోవడం మాత్రమే.

మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన తర్వాత ఏ ఎన్నికను కూడా చంద్రబాబు ఒంటరిగా ఎదుర్కోలేదు. అవసరాన్ని బట్టి బిజెపితోనూ, వామపక్షాలతోను, మరీ దిగజారి కాంగ్రెసుతోనూ కూడా పొత్తు పెట్టుకున్నారు. కొన్ని సందర్భాల్లో గట్టునపడ్డారు. కొన్నిసార్లు భ్రష్టుపడ్డారు. 2019లో వేరే గతిలేక ఒంటరిగా పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ 2014 నాటి గెలుపు కాంబినేషన్ కావాలని అంటున్నారు. ఇదేమీ సెంటిమెంటుతో చేస్తున్న ప్రయత్నం కాదు. ఓటమి భయంతో చేస్తున్న ప్రయత్నం.

పవన్ కల్యాణ్ పట్ల వన్ సైడ్ లవ్ ను ప్రకటించుకుని, 2019 ఎన్నికల్లో తన పాలనను ఆయన తిట్టిపోసిన సంగతిని కూడా చంద్రబాబు పక్కన పెట్టారు. మొత్తానికి చంద్రబాబులో ఉన్న ఓటమి భయానికి రెట్టింపు భయం పవన్ కల్యాణ్ లో కూడా ఉన్నది. ఒంటరిగా పోటీచేస్తే.. ఏ ఒక్కరూ కూడా.. జగన్మోహన్ రెడ్డి హవాను, ప్రజాదరణను తట్టుకోలేం అనే సంగతి చంద్రబాబు కంటె బాగా పవన్ కల్యాణ్ కు ఎరుకపడింది. ఆ విషయం ఆయన పదేపదే చెప్పారు. వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే ప్రతిజ్ఞచేశారు. ఇద్దరూ కలిశారు. 2019కి పూర్వం బూతులు తప్ప.. ఏపీకి ద్రోహం చేశారంటూ అన్ని రకాల తిట్లూ తిట్టిన బిజెపిని కూడా జట్టులో కలుపుకోవడానికి చంద్రబాబునాయుడు వెంపర్లాడుతున్నారు.

ప్రత్యేకహోదా అనే డిమాండ్ ను తన చేజేతులా మంటగలిపేసిన చంద్రబాబు.. ఆ హోదా ఇవ్వకుండా ద్రోహం చేసిన వారి ఎదుట సాగిలపడుతున్నారు. కారణం- కేవలం భయం! ఏపీలో కూడా బిజెపి గ్రాఫ్ గత ఎన్నికల కంటె బాగా పెరిగిందనే భయం. వారు నిర్దిష్టంగా కొంత శాతం ఓట్లు చీలిస్తే తాను చివరిసారిగా సీఎం కాగల అవకాశం చేయిదాటిపోతుందనే భయం.

ఇప్పటికే తన పాలనలో సాగిన అవినీతి కార్యకలాపాలు, దందాల గురించి విచారణలు సాగుతుండగా.. మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే.. తాను ఇక జైలుకే పరిమితం కావాల్సి వస్తుందనే భయం.

ఏ రాజధాని పేరు చెప్పి అనుచరులు, తైనాతీలు అందరితో అమరావతి చుట్టూ రియల్ ఎస్టేట్ దందా చేయించారో.. వేల కోట్ల రూపాయల స్వాహాకు తెరతీశారో.. ఆ దందా మొత్తం పుట్టి మునుగుతుందనే భయం. ఇలా అనేక రకాల భయాలు కలిసి.. చంద్రబాబునాయుడును మోడీ ఎదుట సాగిలపడేలా చేస్తున్నాయి. వారి పొత్తు కోసం ఆరాటపడేలా చేస్తున్నాయి. భేటీలు జరిగిన తర్వాత కూడా వారు నిర్ణయం తెలియబరచకుండా కాలయాపన చేస్తోంటే, ‘వేచిచూసెద ప్రభూ..’ అంటూ వేడుకుంటూ బతికేస్తున్నారు. అడుగు ముందుకు వేయడానికి సాహసించలేకపోతున్నారు.

జనసేన పవన్ కల్యాణ్ తో పలుమార్లు భేటీలు అయ్యాయి. సీట్ల పంపకాల గురించి తేల్చేసుకున్నారు. కానీ ప్రకటించాలంటే ధైర్యం చాలడం లేదు. కమలదళం ఎన్ని సీట్లు అడుగుతుందో.. ఏయే సీట్లు అడుగుతుందో ఆ చర్చ తరువాత.. కనీసం వారి నిర్ణయం రాకుండా ఒకటి రెండు సీట్ల పేర్లు ప్రకటించాలన్నా కూడా భయం. వాళ్లు చేస్తున్న జాప్యం వల్ల.. సీట్లను ప్రకటించలేక పార్టీ నాయకులు ప్రచారంలోకి దిగలేక.. ఒకవైపు వైసీపీ దూసుకుపోతుండగా తాము వెనుకబడుతున్నామని తెలిసినా కూడా భయం.

చంద్రబాబునాయుడుకు మిగిలిన తాజా నిర్వచనం ఏంటో తెలుసా?.. భయం.. భయం.. భయం! మరీ అంత భయమా?

అసహ్యించుకుంటున్న పచ్చదళాలు!

తమ నాయకుడు ఏదో మహానుభావుడని అనుకుంటూ ఉంటే.. ‘వ్యతిరేక ఓటు చీలనివ్వరాదనే’ వ్యూహం పేరిట చంద్రబాబులో వ్యక్తం అవుతున్న భయాన్ని ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా దారుణంగా అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబులోని భయం కారణంగా రాష్ట్రంలో ఒక్కశాతం ఓటు బ్యాంకు కూడా లేని భారతీయ జనతా పార్టీ తమను పూచికపుల్లలాగా చులకనగా చూస్తోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

చంద్రబాబునాయుడు అరెస్టు కారణంగా తమ పార్టీకి విపరీతమైన సానుభూతి మైలేజీ ఏర్పడిందని, కొన్ని వర్గాల్లో జగన్ పట్ల అసంతృప్తి కూడా ఉన్నదని.. ఈ రెండింటినీ సమర్థంగా కలిపి వాడుకుంటే.. తమ పార్టీ ఒంటరిగానే స్పష్టమైన మెజారిటీ సాధించి అధికారంలోకి వస్తుందని తెలుగుదేశంలో కొందరు నాయకులు, కార్యకర్తలకు ఒక నమ్మకం ఉంది. అలాంటి వారు తొలినుంచి కూడా పొత్తులనే వ్యతిరేకిస్తున్నారు. అయినా సరే.. చంద్రబాబునాయుడు పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకోవడాన్నే దిగజారుడుతనంగా వారు భావిస్తున్నారు.

పవన్ వల్ల తమకు అదనంగా వచ్చే లాభం ఇసుమంతైనా లేదని వారు తమలో తాము చర్చించుకుంటున్నారు. సరే.. ఏదో చంద్రబాబునాయుడు భయం వల్ల పవన్ తో పొత్తు పెట్టుకున్నారనే అనుకుందాం.. కానీ సీట్ల సంగతి తేలకుండా నాన్చుతూ రోజులు నెట్టడాన్ని వారు అసహ్యించుకుంటున్నారు. అందుకు బిజెపి చేస్తున్న జాప్యం కారణం కావడం వారికి ఆగ్రహం తెప్పిస్తోంది. చంద్రబాబు లెక్కలేమిటో గానీ.. మనంతట మనం వెళ్లి సాగిలపడి సీట్లు అడగడం వలన బిజెపి గొంతెమ్మ కోరికలు కోరుతుందని.. చంద్రబాబులోని భయం ఆయన రాజీపడేలా చేస్తే పార్టీ మునిగిపోతుందని వారికి అనుమానంగా ఉంది. వారి భయాల్ని కొట్టిపారేయడానికి కూడా వీల్లేదు.

ఆగ్రహిస్తున్న కాషాయ బృందాలు!

తెలుగుదేశం కార్యకర్తల సంగతి అలా ఉంటే.. ఏపీలోని బిజెపి దళాల్లో కూడా పొత్తు ప్రయత్నాల పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. 2014 ఎన్నికల్లో మోడీతో జట్టుకట్టడం కారణంగా అధికారంలోకి వచ్చి.. నాలుగేళ్లు తిరిగేసరికెల్లా అవకాశవాదిగా మారిపోయి.. మోడీని తూలనాడుతూ రాష్ట్రమంతా సభలు పెట్టిన చంద్రబాబునాయుడు వంటి పయోముఖ విషకుంభాన్ని తమ పార్టీ మళ్లీ ఎలా నమ్ముతుంది? అనే ఆగ్రహం వారిలో వ్యక్తం అవుతోంది. చంద్రబాబునాయుడులో ఎప్పటికీ మార్పు రాదని.. ఆయన ఎప్పటికీ అవకాశవాదిగానే ఉంటారని..  ఆయనను నమ్మితే అది మోడీచేసిన రాజకీయ తప్పిదం అవుతుందని వారు అంటున్నారు.

అయోధ్యలో రామాలయం ప్రారంభించిన తర్వాత.. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతాపార్టీకి ప్రజాదరణ అమాంతం పెరిగిపోయిందని నమ్ముతున్న వారు ఉన్నారు. రాష్ట్రంలో ఎప్పటికైనా సొంతంగా అధికారంలోకి రావాలని కలలు గంటున్న పార్టీకి.. ఇప్పుడు పెరిగిన ప్రజాదరణను సద్వినియోగం చేసుకోవడం అవసరం అని వారు భావిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రమంతా ఒంటరిగా పోటీచేస్తే కొన్ని అసెంబ్లీ సీట్లు, ఎంపీ సీట్లు కూడా తమకు సొంతంగా దక్కుతాయనే ఆశ వారికి ఉంది. అలాంటి అవకాశాన్ని వదలుకుని చంద్రబాబుతో దోస్తీ కడితే ఆత్మహత్యా సదృశం అవుతుందనే భయం, దానినుంచి పుట్టిన ఆగ్రహం వారిలో ఉంది. 

ఎందుకు విడిపోయారు? ఎందుకు కలుస్తున్నారు?

2014లో ఈ పార్టీలు మూడూ కలిసి పోటీచేశాయి. 2019 ముగ్గురూ విడిపోయారు. ఇప్పుడు మళ్లీ కలుస్తున్నారు. అయిదేళ్ల కిందట ఎందుకు విడిపోయారు? ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు? అనేది పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్న. ఈ ప్రశ్న సామాన్యులు అందరిలోనూ ఉంది. దీనికి సమాధానం మాత్రం ఆ ముగ్గురిలో ఏ ఒక్కరివద్ద కూడా లేదు. మహా చెప్పగలిగితే.. ఆ కారణం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. జగన్ ను ఎదుర్కోవడం తమకు ఒంటరిగా చేతకాదని ఒప్పుకోవడం మాత్రమే. ఆ చేతగానితనానికి వారు ‘వ్యతిరేక ఓటును చీలనివ్వకపోవడం’ అనే అందమైన ముసుగు కింద ఉంచుతారు.

చంద్రబాబునాయుడులో 2019లో కనిపించని హీరోయిజం పవన్ కల్యాణ్ కు, మోడీకి ఇప్పుడు ఏం కనిపిస్తుందని అనుకోవాలి? అప్పటికీ ఇప్పటికీ.. ముసలితనం తప్ప ఆయనలో వచ్చిన తేడా ఏముంది? ఇవన్నీ కూడా ప్రశ్నలే. 

బాబులో భయమే కాదు దిగజారుడుతనం కూడా!

చంద్రబాబునాయుడు, తాను జగన్ ను ఓడించలేను అనే భయంలో ఏ రకంగా అయితే మోడీ పాదాల వద్ద సాగిలపడి వారు దయపెట్టినప్పుడు వారితో పొత్తులు పెట్టుకోవాలని ఆరాటపడుతున్నారో.. అదే తరహాలో మరో రకమైన దిగజారుడుతనాన్ని కూడా బయటపెట్టుకుంటున్నారు. వైసీపీని బలహీనపరుస్తున్నాం అనే యావలో.. ఆ పార్టీని ఛీకొడుతున్న నాయకులందరినీ కూడా తన జట్టులో కలుపుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.

అవినీతి ముద్రపడి కళంకితుడైన ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం వంటి వారిని కూడా పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా పచ్చిగా దొరికి పోయిన మాగుంట కుటుంబాన్ని కూడా కలుపుకోవాలని అనుకుంటున్నారు. వీరు మాత్రమే కాదు.. అవినీతి, చేతకానితనం, ప్రజాదరణ లేకపోవడం వంటి కారణాలచేత జగన్ పక్కన పెట్టిన వారందరూ.. చంద్రబాబుకు ఆరాధ్యులు అవుతున్నారు. ఈ దిగజారుడుతనం పార్టీని ఏ పాతాళానికి తీసుకువెళుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. 

మరి ఇన్ని భయాలు ఉన్నప్పుడు చంద్రబాబు రాజకీయం చేయడం ఎందుకు? హాయిగా రాజకీయ సన్యాసం తీసుకుని ఇంటిపట్టున కూర్చుని మనవడితో ఆడుకోవచ్చు కదా అని ఎవరికైనా అనిపిస్తుంది. చంద్రబాబులో భయాన్ని మించిన లక్షణం ఇంకోటి ఉంది. అదే ఆశ! తాను మళ్లీ ముఖ్యమంత్రిని కావాలనే అత్యాశ. ఆ ఆశ ఆయనలోని ఇన్ని భయాలను కూడా జయించి.. అందరి ఎదుట సాగిలపడి పొత్తులు పెట్టుకోవడానికి, దిగజారి పార్టీలోకి మనుషుల్ని చేర్చుకోవడానికి పురిగొల్పుతున్నది. ఈ భయం- ఆశల దోబూచులాట మధ్య చంద్రబాబు ఏమైపోతారో చూడాలి. 

.. ఎల్. విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?