రాజకీయాలలో స్వచ్చంద పదవీ విరమణలు ఉండవు. బలవంతంగానే ఉంటాయి. ఎన్ని ఎన్నికలు చూసినా టిక్కెట్ కోసం అలా ఆశ పడుతూనే ఉంటారు. టిక్కెట్ దక్కని నేపధ్యంలోనే తెర వెనకకు వస్తారు.
ఇప్పుడు మాజీ మంత్రి విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి విషయంలో అదే జరుగుతోందా అంటే పరిణామాలు చూస్తే అదే అంటున్నారు.
1989లో తొలిసారి అప్పటి పరవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బండారు 1994, 1999లలో వరసగా గెలిచారు. 2004, 2009లలో ఓడారు. 2014లో పరవాడ పెందుర్తిగా మారాక మళ్లీ గెలిచారు. 2019లో భారీ తేడాలో ఓటమి పాలు అయ్యారు.
ఇక 1998 ప్రాంతంలో ఆయన ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. 2024లో తనకు టిక్కెట్ ఇస్తే మంత్రిగా మరోసారి పనిచేసి తన కుమారుడికి రాజకీయ వారసత్వం అప్పగించాలని బండారు అనుకున్నారు. కానీ జనసేనతో పొత్తులతో ఆయన ఆశలు చిత్తు అయ్యాయి.
విశాఖకు ఇటీవల వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెందుర్తి సీటు జనసేనకే అని ఖరారు చేశారు. దాంతో బండారు ఆశలు నీరుకారాయని అంటున్నారు. ఏడు పదులకు చేరువలో ఉన్న ఆయనకు ఇక రాజకీయ రిటైర్మెంట్ పార్టీ ఇచ్చేసిందని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.