ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పోల్చుకుంటే.. లేట్‌గా అయినా లేటెస్ట్గా చంద్రబాబు ఏకంగా 94 మంది అభ్యర్థులను ప్రకటించారు. అలాగే జనసేన సీట్లపై కూడా బాబు స్పష్టత ఇచ్చారు. ఇక బీజేపీ సంగతి తేలాల్సి వుంది. నిజానికి చంద్రబాబు సహజ ధోరణికి విరుద్ధంగా అభ్యర్థులను ప్రకటించారు. చంద్రబాబు ఎప్పుడైనా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా సీట్లపై తేల్చేవారు కాదు. కానీ తన ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్ అభ్యర్థుల ప్రకటనపై దూకుడు ప్రదర్శిస్తుండడంతో బాబు కూడా ఆయన్ను తప్పనిసరి పరిస్థితిలో అనుసరించాల్సి వచ్చింది.
అది కూడా వైసీపీ ఆరేడు జాబితాలు విడుదల చేసి… అందులో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను కలుపుకుంటే 70 మంది ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఒకేసారి 94 మందిని ప్రకటించి ఔరా అనిపించారు. జనసేనకు సంబంధించి ఐదుగురు అభ్యర్థుల్ని పవన్ ప్రకటించారు. దీంతో టీడీపీ-జనసేన కూటమి మొత్తం 99 మంది అభ్యర్థుల్ని ప్రకటించినట్టైంది. ఇక 76 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్థుల్ని కూటమి ప్రకటించాల్సి వుంది.
ఇంత పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థుల్ని ప్రకటిస్తారని ఆ పార్టీల నాయకులు కూడా ఊహించలేదు. అభ్యర్థుల మంచీచెడుల గురించి కాసేపు పక్కన పెడితే, తాము సైతం సిద్ధం అని జగన్‌కు ప్రతి సవాల్ విసిరేందుకు బాబు, పవన్‌లకు అవకాశం దొరికింది. జగన్ కంటే ఎక్కువ మంది అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో జగన్‌పై మీసాలు తిప్పేందుకు చంద్రబాబు, పవన్ ఉత్సాహం ప్రదర్శిస్తారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధానంగా మార్చే నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన చోట్ల సిటింగ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ప్రజల్లోకి వెళ్లేలా సమాయత్తం చేశారు. టీడీపీ అభ్యర్థుల ప్రకటనతో ఇక ప్రజాక్షేత్రంలో రాజకీయ వేడి పెరగనుంది. ఇంతకాలం ఈ మాత్రమైన అభ్యర్థులపై స్పష్టత లేకపోవడంతో ప్రజల్లోకి స్వేచ్ఛగా వెళ్లేందుకు టీడీపీ నేతలకు ధైర్యం చాల్లేదు. తాజాగా 94 మంది టీడీపీ, అలాగే ఐదుగురు జనసేన అభ్యర్థులకు అధికారికంగా టికెట్లు దక్కడంతో కూటమిలో జోష్ పెరగనుంది.